
కలెక్టర్ చెప్పినా కరుణించరా?
బాల్కొండ: రహదారిపై కిలోమీటర్ల మేర ఉన్న ధాన్యం బస్తాలను రెండ్రోజుల్లో తరలించాలని సాక్షాత్తు జిల్లా పాలనాధికారి ఆదేశించినా అధికారుల్లో చలనం లేదు. ముప్కాల్ మండలం వెంచిర్యాల్ గ్రామశివారులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రెండు రోజుల క్రితం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పరిశీలించారు. జాతీయ రహదారి 44 నల్లూర్ చౌరస్తా నుంచి పెద్ద వాగు వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర రోడ్డుపై ధాన్యం బస్తాలు, వడ్ల కుప్పలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారణాలు చెప్పకుండా రెండ్రోజుల్లో బస్తాలను తరలించాలని అధికారులను ఆదేశించారు. కానీ, పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా ఉంది. తూకం వేసి నెల రోజులు దాటుతున్నా ధాన్యం బస్తాలు తరలించక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్వయంగా కలెక్టరే పరిస్థితిని గమనించి అధికారులను ఆదేఽశించినా ప్రయోజనం లేకపోవడంతో నిట్టూరుస్తున్నారు. మరోవైపు నెలల తరబడి ధాన్యం తూకం వేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం గాలివాన కురుస్తుండడంతో ధాన్యం కుప్పలపై ముళ్లకంపలు వేస్తున్నారు. అధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేసి, ధాన్యం బస్తాలను తరలించాలని వేడుకుంటున్నారు.
పెద్దవాగు రోడ్డుపై ధాన్యం బస్తాలు
రెండు రోజుల్లో తరలించాలని
అధికారులను ఆదేశించిన కలెక్టర్
ఇప్పటికీ కదలని ధాన్యం బస్తాలు
నెల రోజులవుతోంది..
పెద్దవాగు రోడ్డుపై ధాన్యం ఆరబెట్టి కుప్పలు చేసి నెల రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు బస్తాలు నింపి కాంటా వేయలేదు. ధాన్యం నింపిన బస్తాలను మిల్లుకు తరలించలేదు. కలెక్టర్ చెప్పినా పట్టించుకోవడం లేదు.
– గంగారెడ్డి, రైతు, నాగంపేట్

కలెక్టర్ చెప్పినా కరుణించరా?