
జిల్లా కీర్తిని ప్రపంచానికి చాటిన సౌమ్య
నిజామాబాద్‌నాగారం: జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటుతూ జిల్లా కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నారని, ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య మరింత చాటిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని గీతా భవనంలో శనివారం నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ జట్టులో స్థానం పదిలం చేసుకున్న గుగులోత్ సౌమ్యకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ హాజరై ఆమెను అభినందిస్తూ సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు తాను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుతో కలిసి కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఉపాధ్యక్షుడు భక్తవత్సలం మాట్లాడుతూ.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జిల్లాకు ప్రత్యేక క్రీడామైదానంతోపాటు కోచ్‌లు, వసతులు లేక క్రీడాకారులు ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. కోచ్ నాగరాజు, నిఖత్ జరీనా, భూమ్‌రెడ్డి సంజీవరెడ్డి, అబ్బన్న, రమే్‌శ , ఉమర్, సురేశ్, జావీద్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.