
అప్రమత్తంగా ఉండాలి
● డీఎస్పీ విఠల్ రెడ్డి
నస్రుల్లాబాద్(బాన్సువాడ): పోలీసులు విధు ల్లో అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ డీఎ స్పీ విఠల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డయల్ 100కు ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు స్పందించాలన్నారు. సైబర్ క్రైంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట పీఎస్సై అరుణ్ కుమార్, సిబ్బంది శ్రీనివాస్, రాము, సరిత తదితరులు ఉన్నారు.
గ్యాస్ సిలిండర్ లీక్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని తాండూర్ గ్రామంలోని ఓ ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ లీకై న ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. తాండూర్‌కు చెందిన వృద్ధ దంపతులు దుర్గం రాములు, పెంటమ్మ ఇంట్లో సాయంత్రం గ్యాస్ సిలిండర్‌పై వంట చేస్తుండగా ఆకస్మికంగా గ్యాస్‌పైపు లీకై మంటలు వచ్చాయి. భయపడిన వృద్ధదంపతులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి మండుతున్న గ్యాస్ సిలిండర్‌ను బయటికి తీసుకొచ్చారు. అనంతరం మంటలను ఆర్పివేయడంతో ప్రాణాపాయం తప్పింది.
అసభ్యకర పోస్టింగ్‌పై ఫిర్యాదు
నవీపేట: మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్ చేయడంపై బీజేపీ నాయకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రి, పలు రాష్ట్రాల సీఎంల చిత్రాలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఫొటో వైరల్ కావడంతో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు బూనాది ప్రవీన్, సందీప్, అజయ్, దినేశ్, రాహుల్ ఫిర్యాదు చేశారు.
ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు మృతి
నిజామాబాద్ నాగారం: జిల్లా కేంద్రంలోని మనోరమ ఆస్పత్రిలో ఓ నర్సు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా డోంగ్లికి చెందిన శిల్ప నగరంలోని మనోరమ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. శుక్రవారం రాత్రి శిల్ప విధులకు హాజరుకాగా, జ్వరంతో బాధపడుతూ రాత్రి అదే ఆస్పత్రిలో నిద్రపోయింది. తెల్లవారుజామున తోటి నర్సులు, సిబ్బంది నిద్ర లేపే ప్రయత్నం చేయగా చలనం లేకపోవడంతో వైద్యులు పరీక్షించి శిల్ప మృతి చెందినట్లు గుర్తించారు. స్థానిక ఒకటో టౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు.