
బైక్ చోరీల కేసులో నిందితుడి అరెస్టు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): చెడు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై యాదగిరిగౌడ్, సీఐ సురేష్ తెలిపారు. మోపాల్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం వారు కేసు వివరాలను వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని వివేకానంద కాలనీకి చెందిన భూమిగారి నవీన్, తల్లి రాజేశ్వరితో కలిసి నివాసం ఉంటున్నాడు. కూలీ పని చేసుకునే క్రమంలో చెడు వ్యసనాలకు బానిసై ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. పలు కేసుల్లో గతంలో జైలు జీవితం గడిపాడు. జైలు నుంచి బయటకు వచ్చిన అతడు కొన్ని నెలలుగా బతుకుదెరువు కోసం ఆటో నడుపుకుంటున్నాడు. కానీ ఆదాయం సరిపోకపోవడంతో మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈనెల 5న రోటరీనగర్‌లో బైక్ చోరీ చేసి, అదేరాత్రి మంచిప్ప శివారులోగల గండి మైసమ్మ ఆలయంలో, ముదక్‌పల్లిలోని సూదులమ్మ ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు. అలాగే ఇంటి ఆవరణలో పెట్టిన బైక్‌ను చోరీ చేశాడు. బైక్‌లను శుక్రవారం తరలిస్తున్న క్రమంలో మోపాల్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాలను ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేష్ తెలిపారు. ఏఎస్సై రమేష్‌బాబు, సిబ్బంది దూప్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.