
వన మహోత్సవానికి సన్నద్ధం
● 22 నర్సరీల్లో మొక్కల పెంపకం
● ఎండల నుంచి రక్షణకు
గ్రీన్ షెడ్ నెట్‌ల ఏర్పాటు
ధర్పల్లి: పల్లెల్లో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏడాది మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించారు. గత ప్రభుత్వం హరితహారం పేరుతో నాటిన మొక్కలు పెరిగి చెట్లుగా ఎదగడంతో గ్రామాల్లో పచ్చదనం కనువిందు చేస్తోంది. పల్లెల్లో, రహదారుల వెంట నాటిన మొక్కలు నీడనిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో మొక్కలను నాటుతున్నారు. నర్సరీలో మొక్కల పెంపకం ప్రక్రియ గతేడాది అక్టోబర్ నుంచే ప్రారంభించారు. వానాకాలం ప్రారంభం కాగానే వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. దానికి సరిపడా మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేస్తున్నారు.
1.76 లక్షల మొక్కలు లక్ష్యం
ధర్పల్లి మండలంలో ఈ ఏడాది వర్షాకాలంలో 1లక్ష 76 వేల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 22 జీపీల్లో మొక్కలు పెంచేందుకు 22 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 8 వేల మొక్కల చొప్పున మండలంలో మొత్తం 1లక్ష76 వేల మొక్కలను గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీలో పెంచుతున్నారు. నర్సరీలో మొక్కల సంరక్షణకు అధికారులు ప్రతి నర్సరీలో వన సేవకులను నియమించారు. మొక్కలకు ఉదయం, సాయంత్రం వేళల్లో మొక్కలకు నీరందిస్తున్నారు. ఎండవేడికి మొక్కలు చనిపోకుండా ప్రతి నర్సరీలో గ్రీన్ షెడ్ నెట్‌లను ఏర్పాటు చేశారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నారు. జూన్ నెలలో ప్రభుత్వం నిర్వహించే వన మహోత్సవంలో మొక్కలను నాటనున్నారు.
ఇళ్లల్లో పెంచేందుకు వీలుగా..
గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలో ఇళ్లల్లో పెంచేందుకు వీలుగా గులాబీ, మల్లె, జామ, దానిమ్మ, వేప, తులసి ఉసిరి, నిమ్మ, బొప్పాయి, అల్లనేరేడు, ఆకాశమల్లి వంటి 20 రకాల ఉపయోగ మొక్కలతో పాటు ఇతర ప్రదేశాల్లో నాటేందుకు ఈత, తాటి మొక్కలను, రైతులకు ఉపయోగపడే మొక్కలను సైతం వన మహోత్సవంలో నాటేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ
నర్సరీలో మొక్కలు ఎదగడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. వనమహోత్సవ కార్యక్రమానికి సరిపడా మొక్కలను నర్సరీ లో పెంచుతున్నాం. వర్షాలు ప్రారంభం కాగానే గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశాం. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు చేపడతాం.
– బాలకృష్ణ, ఎంపీడీవో, ధర్పల్లి

వన మహోత్సవానికి సన్నద్ధం