
చెత్త రహిత డివిజన్లుగా మార్చాలి
నిజామాబాద్ సిటీ: కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ అధికారులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం బల్దియా కార్యాలయంలో పారిశుధ్య సూపర్‌వైజర్, ఇన్‌స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో చెత్త సేకరణ, చెత్త తొలగింపులో అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవన్నారు. చెత్త తొలగింపులో మైక్రో ప్లానింగ్ చేయాలన్నారు. నగరంలో ఎక్కువ పారిశుధ్య సమస్యలు ఉన్న ఆరు డివిజన్లను తీసుకుని చెత్త రహిత డివిజన్లుగా మారుద్దామని సూచించారు. వీటిని గుర్తించి ప్రత్యేక టీమ్‌ల ద్వారా చెత్త లేకుండా చూడాలన్నారు. నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతి రోజు కుక్కలను పట్టే సిబ్బంది విధులు నిర్వహించాలని, కుక్కలను పట్టి ఏబీసీ సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ జయకుమార్, శానిటరీ సూపర్‌వైజర్ సాజిద్ అలీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు షాదుల్లా, శ్రీకాంత్, సునీల్, మహిపాల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి
మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్