
పంటపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలి
జక్రాన్‌పల్లి: పంటలపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలని వరి పరిశోధన స్థానం రుద్రూర్ కీటక శాస్త్రవేత్త సాయిచరణ్ సూచించారు. శుక్రవారం జక్రాన్‌పల్లి రైతు వేదికలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు యూరియాను సిఫారసు చేసిన మోతాదులోనే వినియోగించాలన్నారు. ఎక్కువగా వాడకం వల్ల పంటరసం పీల్చే పురుగులు, ఇతర వ్యాధులకు గురవుతుందని తెలిపారు. రైతులు విత్తన, పురుగుల మందులను కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు పొందాలన్నారు. ఎప్పటికప్పుడు పంట మార్పిడి చేసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులు ఉపయోగిస్తూ ఎక్కువ దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఏవో దేవిక, కోటపాటి నర్సింహానాయుడు, తిరుపతిరెడ్డి, ఏఈవోలు శ్రీకాంత్, శివప్రసాద్, శంకర్, సుభాష్య, రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి విజ్ఞానాన్ని జోడిస్తేనే లాభాలు
ఇందల్వాయి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లె జీపీలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదర్శ రైతులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయంలో విజ్ఞానంతో కూడుకున్న అధునాతన పద్ధతులు రైతులు అవలంబించాలని, అందుకు క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు తక్కువగా వాడాలని సూచించారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాల మేరకు యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాలన్నారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ టి అంజయ్య, నిజామాబాద్ రూరల్ ఏడీఏ ప్రదీప్ కుమార్, ఆహార శాస్త్రవేత్త అమల, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

పంటపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలి