
ధైర్యానికి నిలువెత్తు రూపం మహారాణా ప్రతాప్
సుభాష్‌నగర్: ధైర్యానికి, శౌర్యానికి, దేశభక్తికి నిలువెత్తు రూపం మహారాణా ప్రతాప్ అని, మొఘలుల నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భరతమాత ముద్దుబిడ్డ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా కొనియాడారు. శుక్రవారం నగరంలోని ఎల్లమ్మగుట్టచౌరస్తాలో బొందిల రజక సంఘం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాణా ప్రతాప్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధన్‌పాల్ మాట్లాడుతూ.. మహారాణా ప్రతాప్ సింగ్ విదేశీయులకుసైతం స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. అమెరికాపై రెండు దశాబ్దాల సుదీర్ఘపోరాటం తర్వాత విజయం సాధించిన వియత్నాం దేశాధ్యక్షుడు తమ గెలుపునకు మహారాణా ప్రతాప్ సింగ్ ప్రేరణదాయకమని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. వియత్నాం విదేశాంగశాఖ మంత్రి దేశ పర్యటనకు వచ్చినప్పుడు ఉదయపూర్‌లో రాణా ప్రతాప్ సమాధిని దర్శించుకుని, అక్కడి నుంచి పిడికెడు మట్టిని తీసుకెళ్లి ఈ దేశ వీరత్వం మా దేశానికి కూడా అవసరముందని చెప్పారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు న్యాలం రాజు, రజక సంఘం నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ