
శాఖల మధ్య సమన్వయ లోపం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ వన్యమృగాలకు డెత్ స్పాట్‌గా మారింది. దట్టమైన అటవీ ప్రాంతంలో మూగజీవాల రక్షణకు ఫారెస్ట్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ముఖ్యంగా సాసర్ పిట్ల నిర్వహణ, వాటి ఏర్పాటులో అలసత్వం వన్యమృగాల పాలిట శాపంగా మారింది. దీనికితోడు అటవీ ప్రాంతంలో రైల్వేశాఖ, జాతీయ రహదారుల విభాగం అండర్ పాస్‌ల నిర్మాణం చేపట్టకపోవడంతో వన్యప్రాణులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. తాజాగా ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చంద్రాయన్‌పల్లి శివారు 44వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండేళ్ల వయస్సుగల చిరుత మృత్యువాత పడింది. ఈఘటనతో హైవేలు, రైల్వేట్రాక్‌ల వద్ద అండర్‌పాస్‌ల నిర్మాణం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు ఇందల్వాయి రేంజ్ సదాశివనగర్, సిరికొండ రేంజ్‌కు మాచారెడ్డి మండలాలను కలుపుతూ అడవులున్నాయి. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారి, సికింద్రాబాద్ నుంచి ముంబయి వెళ్లే రైల్వే ట్రాక్ ఈ అటవీ ప్రాంతం గుండా వెళ్తుంది. వేసవిలో అటవీ ప్రాంతంలో తాగునీటి కొరత ఏర్పడుతుంది. వాగులు, వంకలు, చెలిమెలు ఎండిపోతాయి. తద్వారా వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి బయటికి వస్తుంటాయి. నీటి కోసం వెతుకుతూ హైవేలు, రైల్వేట్రాక్‌లు దాటుతుంటాయి. ఈ క్రమంలో రాత్రివేళల్లో చిరుతలు సహా ఇతర వన్యప్రాణులు, మృగాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. కొన్నిసార్లు మృతి చెందుతున్నాయి.
నేషనల్ హైవే అధికారులను
సంప్రదిస్తున్నాం..
ఇందల్వాయి, సదాశివనగర్ మధ్యలోగల నేషనల్ హైవే రహదారిపై చిరుతలు, ఇతర వన్య ప్రాణులు ప్రమాదాలకు ఎక్కువగా గురై మరణిస్తున్న విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రహదారికి ఇరువైపులా ఫెన్సింగ్ వేయాలని, అలాగే రహదారి కింద అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరాం. ఇలా చేస్తే వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు ఉండదని వివరించాం. నేషనల్ హైవే అథారిటీ సానుకూలంగా స్పందించారు.
– వికాస్ మీనా, జిల్లా అటవీశాఖ అధికారి
అటవీ ప్రాంతంలో వన్యమృగాల సంరక్షణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. తద్వారా మూగజీవాల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వీటి సంరక్షణ కోసం అటవీశాఖ, రైల్వేశాఖ, జాతీయరహదారుల విభాగం సమన్వయంతో చర్యలు చేపట్టాల్సి ఉంది. వీరి మధ్య సమన్వయ లోపం కారణంగా పనులు కార్యరూపం దాల్చడంలేదు. ముఖ్యంగా రైల్వేట్రాక్, జాతీయ రహదారులకు అండర్ పాస్‌ల నిర్మాణం చేపడితే ఈ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాగా ఈ విషయమై హైవే ఈఈ మల్లారెడ్డిని వివరణ కోరగా స్పందించలేదు.
● 2018 జనవరిలో రైలు ఢీకొనడంతో సిర్నాపల్లి అటవీ ప్రాంతంలో చిరుత మృతి.
● 2019 మేలో రూప్లానాయక్ తండా వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో చిరుత మృతి.
● 2023 ఫిబ్రవరిలో చంద్రాయన్‌పల్లి అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందిన చిరుత.
● తాజాగా 2025 మే 7న చంద్రాయన్‌పల్లి జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృత్యువాత.
తాజాగా రోడ్డు ప్రమాదంలో
చిరుత మృత్యువాత
కనిపించని సంరక్షణ చర్యలు
అండర్‌పాస్‌లు లేక
తరచూ ప్రమాదాలు
కొరవడిన రైల్వే, హైవే,
అటవీ అధికారుల సమన్వయం

శాఖల మధ్య సమన్వయ లోపం..

శాఖల మధ్య సమన్వయ లోపం..