
నల్ల మట్టి మోతాదు మించొద్దు
బాల్కొండ: భూసారం పెంచడం కోసం రైతులు నల్లమట్టిని విచ్చలవిడిగా పంట భూముల్లో వేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు తగ్గుముఖం పట్టి నల్ల మట్టి వస్తోంది. ప్రధానంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతం నుంచి అధికంగా నల్లమట్టి లభిస్తుంది. ఈక్రమంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని భావించి రైతులు నల్ల మట్టిని తరలిస్తున్నారు. ఎకరానికి 60 నుంచి 75 టన్నుల నల్ల మట్టిని వేస్తున్నారు. ఒక డంపర్ 12వేల ధర పెట్టి ఎకరంలో మూడు డంపర్ల నల్ల మట్టిని వేస్తున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. కానీ ఎక్కువగా నల్ల మట్టి వేయడంతో నేలకు నష్టం కలుగుతుందని బాల్కొండ ఏవో బద్దం లావణ్య హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా పసుపు పంటను సాగు చేసే నేలల్లోనే ఎక్కువగా నల్ల మట్టిని వేస్తున్నారు. నేల రకాలను బట్టి నల్లమట్టి గుణం మారుతుందంటున్నారు.
● నల్ల మట్టి ఎక్కువ వేయడం వలన నేలలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పసుపు పంటకు దుంపకుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది.
● ఎకరానికి 20–25 టన్నులు మాత్రమే నల్ల మట్టి వేసుకోవాలి.
● నల్లమట్టి ఎక్కువ కావడం వలన నేల దిబ్బ పారుతుంది. దీంతో పంట వేర్లు లోపలికి వెళ్లకుండా అడ్డు పడుతుంది.
● నల్ల మట్టి అధికంగా ఉండటంతో కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి.
● పొలాల్లో నీటి పారుదల సరిగా ఉండదు. నీరు నిల్వ ఉండటం వల్ల పంట అంతటికి అందకుండా పోతుంది.
● నల్లమట్టి వేసిన నేలల్లో కొన్ని మొక్కలు సరిగ్గా పెరగవు.
● భూమి సారవంతం కూడ తగ్గిపోయే ప్రమాదం ఉంది.
● ప్రధానంగా నల్లమట్టి పత్తి సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఇతర పంటలకు అంతగా అనుకూలమైంది కాదు.
పంట భూమిలో విచ్చలవిడిగ
వేస్తున్న అన్నదాతలు
మోతాదు కంటే ఎక్కువగా వేస్తే
తిప్పలు తప్పవంటున్న అధికారులు