
ఎండలతో జీవాలకు ముప్పు
డొంకేశ్వర్(ఆర్మూర్): తీవ్రమైన ఎండలతో పాటు వడగాలుల ప్రభావంతో ప్రజలతోపాటు మూగ జీవాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనుషులకు ఎండదెబ్బ తలుగుతోంది. అలాంటిది బయట మేతకోసం సంచరించే పశువు లు, గొర్రెలు, మేకలతో పాటు పక్షులు ఎంత అల్లాడుతున్నాయో చెప్పనక్కర్లేదు. మండుతున్న ఎండల బారినుంచి మూగ జీవాలను ఏ విధంగా కాపాడుకోవాలో గురువారం పశుసంవర్ధక శాఖ జిల్లా ఇ న్‌చార్జి అధికారి రోహిత్ రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.
● గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులను ఎక్కువగా ఎండలో తిప్పకూడదు. వీలైనంత వరకు చల్లని ప్రాంతాల్లో, నీడపట్టున ఉంచాలి. ఇంటి వద్ద రేకుల షెడ్డు ఉన్న వారు పైన వరిగడ్డి ఉంచితే వేడి ప్రభావం తక్కువగా ఉంటుంది. వీలైతే ఫ్యాన్‌లు కూడా పెట్టుకోవాలి.
● మేతను ఎక్కువగా ఇంటి వద్దే అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. బయటకు తీసుకెళ్లడం తప్పనిసరైతే, ఉదయం 6 నుంచి 10 గంటల్లోపు తీసుకెళ్లాలి. మళ్లీ సాయంత్రం 5 దాటిన తర్వాత మరోసారి మేతకు తీసుకెళ్లాలి.
● వేసవిలో పశువులు ఎక్కువ మొతాదులో నీటిని తాగుతాయి. వాటికి సరిపడా చల్లని, శుభ్రమైన నీటిని అందించాలి. ఒక్కో గేదె 50 లీటర్ల నీళ్లు తాగేలా చూడాలి. మేత, దానా పచ్చి రూపంలో అందిస్తే బాగుటుంది.
● జంతు ప్రేమికులు వారి ఇళ్లలో పెంచుకునే కుక్కలు, పిల్లుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎల్లప్పుడు నీడ పట్టున ఉంచి క్రమం తప్పకుండా ఆహారం, నీటిని అందించాలి. పక్షుల కోసం ఇంటి బయట గిన్నెలు, పాత్రల్లో నీటిని పోసి ఉంచాలి.
● ఒకవేళ పశువులు, గొర్రెలు, మేకలు, పెంపుడు కుక్కలు ఎండ ప్రభావానికి, ఎండదెబ్బకు గురైతే వాటి శరీరం వేడిగా, పొడిబారి ఉంటుంది. వెంటనే తడిబట్టతో తుడవాలి, లేదా కప్పి ఉంచాలి.
● జీవాల ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే స్థానిక పశువైద్య అధికారులకు సమాచారం అందించాలి. వారు వెంటనే వచ్చి చికిత్స అందిస్తారు.
పశువులు, గొర్రెలను నీడపట్టున ఉంచాలి
ఉదయం, సాయంత్రం వేళల్లో మేతకు తీసుకెళ్లడం మేలు
పశు పెంపకందారులకు పశుసంవర్ధక శాఖ జిల్లా ఇన్‌చార్జి రోహిత్‌రెడ్డి సూచన

ఎండలతో జీవాలకు ముప్పు