
భారత సైన్యానికి అభినందనలు
డిచ్‌పల్లి: ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపి, ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అభినందనలు తెలిపారు. ఈ దాడిని ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లోని ముస్లిం మతపెద్దలు సమర్థించడం అభినందనీయమన్నారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గాంలో హిందువులను ఉగ్రవాదులు దారుణంగా చంపారన్నారు. ఈ ఘటనపై ప్రతీకారంగా పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టి భారతదేశ జెండాను, భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల నలుమూలల గర్వించేలా చేశారని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ లాంటి దేశాలకు ఇది కనువిప్పు కావాలన్నారు. ఏ దేశంలో కూడా ఉగ్రవాదంతో ప్రజల జీవితాలు బాగుపడిన దాఖలాలు లేవన్నారు. భారత సైన్యాన్ని, ప్రధాని మోదీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రకాంత్, బీజేవైం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్‌రెడ్డి, నాయకులు శ్యాంరావు, గంగారెడ్డి, బాలయ్య, లక్ష్మణ్, విఠల్, పరుశురాం, వినోద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.