
నీటిని ఒడిసి పట్టి.. కరువును జయించి..
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం దోన్‌పా ల్ గ్రామం కరువును జయించి, పుష్కల నీటి వనరులతో ఆదర్శంగా నిలుస్తోంది. వేసవిలోనూ గ్రామంలోని బోర్లు సమృద్ధిగా భూగర్భ జలాల ఉండటంతో నీటి కొరత లేకుండా పోయింది.
2002కు ముందు..
దోన్‌పాల్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. 2002కు ముందు ఎలాంటి సమగ్ర నీటి సంరక్షణ చర్యలు తీసుకోక పోవడంతో నవంబర్, డిసెంబర్‌లోనే నీటి కొరత ఛాయలు కనిపించేవి. రైతులు తమ యాసంగి పంటలను గట్టెక్కించుకోలేక తీవ్రంగా నష్టపోయేవారు. గ్రామం చుట్టూ అడవి ఉన్నా వర్షపు నీటిని సంరక్షించుకునే చర్యలు లేకపోవడంతో బోర్లు ఎత్తిపోయేవి. వర్షాకాలం వచ్చే వరకూ నీటి కోసం రైతులు, గ్రామస్థులు ఎదిరి చూసే పరిస్థితి ఉండేది.
ఎంపీడీవో ఆంజనేయులు విశేష కృషి..
గ్రామంలోని కరువు దుస్థితిని అప్పట్లో మోర్తాడ్ ఎంపీడీవోగా పని చేసిన ఆంజనేయులు చూసి స్పందించారు. ఉన్నతాధికారులకు దోన్‌పాల్‌లోని నీటి సమస్యను విన్నవించడంతో అప్పట్లోనే కందకాలను తవ్వించారు. ఊట కుంటలను ఏర్పాటు చేశారు. బోర్ల వద్ద రీచార్జి చర్యలు తీసుకోవడం, ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలతో దోన్‌పాల్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అప్పట్లో తీసుకున్న చర్యలతో గ్రామంలో కరువు జాడలు అసలే లేవు. 2015లో ఏర్పడిన తీవ్ర కరువు పరస్థితిలోనూ గ్రామంలోని రైతాంగం తమ పంటలను గట్టెక్కించుకోగలిగారు. ప్రతి వేసవిలో చెరువు ఎండిపోయినా భూగర్బ జలాలు సమృద్ధిగా ఉండి నీటి కొరత అనేది లేకుండా పోయింది. అటవీ ప్రాంతంలో తవ్విన కందకాల వల్ల నీరు నిల్వ ఉండి వన్య ప్రాణులకు వేసవిలోనూ తాగునీరు దొరుకుతుంది. ఈసారి వర్షాపాతం తక్కువగా ఉండటంతోనే కుంటలు, కందకాలలో నీరు తక్కువగా ఉందని, లేకుంటే ఎప్పుడు నిండు కుండలా ఉండేవని గ్రామస్తులు తెలిపారు. పదుల సంఖ్యలో కందకాలు, ఊట కుంటలు తవ్వించడంతో నీటి సంరక్షణ చర్యలు సజావుగా సాగుతున్నాయి.
ఆదర్శంగా నిలిచిన దోన్‌పాల్
సమగ్ర నీటి సంరక్షణ చర్యలతో 2002 నుంచి కనిపించని కరువు ఛాయలు
వేసవిలోనూ సమృద్ధిగా భూగర్భ జలాలు

నీటిని ఒడిసి పట్టి.. కరువును జయించి..