వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

May 7 2025 12:34 AM | Updated on May 7 2025 1:21 PM

-

నందిపేట్‌(ఆర్మూర్‌): నందిపేట మండలం కుద్వాన్‌పూర్‌ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో ఆటో బోల్తా పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆర్మూర్‌ మండలం పిప్రి గ్రామానికి చెందిన గోక అశోక్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం నందిపేట మండలంలోని కుద్వాన్‌పూర్‌ ఎల్లమ్మ ఆలయానికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాడు. దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరగా ఎల్లమ్మ గుట్ట పైనుంచి ఆటో కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న గోక సాయన్న (65), మమత, నితిన్‌, లక్ష్మిప్రసన్నలకు గాయాలు కాగా వారిని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోక సాయన్న మృతి చెందాడు. మృతుడి కొడుకు గోక అశోక్‌ ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్‌ గట్టు సత్యనారాయణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

పిట్లం మండలంలో..

పిట్లం(జుక్కల్‌): బైక్‌ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని రాంపూర్‌ గ్రామ శివారులోని పిట్లం–బాన్సువాడ రహదారిపై చోటు చేసుకుంది. పిట్లం ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మానూర్‌ గ్రామానికి చెందిన సౌదర్పల్లి యాదగిరి (34) తన బైక్‌పై సోమవారం రాత్రి అంకోల్‌ తండా నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో మండలంలోని రాంపూర్‌ గ్రామ శివారులో బైక్‌ అదుపుతప్పడంతో యాదగిరి కిందమీద పడి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడి తల్లి విట్టవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

వర్ని మండలంలో..

వర్ని: వర్ని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోవూరు–చందూరు గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగారాం (60) అక్కడికక్కడే మృతి చెందినట్లు వర్ని మహేష్‌ వెల్లడించారు. రోడ్డుపై వెళ్తున్న గంగారాంను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

డొంకేశ్వర్‌ మండలంలో..

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మండలంలోని అన్నారం మాజీ గ్రామ సర్పంచ్‌ మంగ్లారం పోశన్న (47) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నికాల్‌పూర్‌లో సోమవారం జరిగిన బంధువుల ఫంక్షన్‌కు పోశన్న వెళ్లాడు. రాత్రి స్కూటీపై తిరిగి ఇంటికి బయలుదేరాడు. అన్నారం గ్రామ శివారులోకి రాగానే మూల మలుపు వద్ద స్కూటీ అదుపుతప్పడంతో కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. అంత్యక్రియలు బుధవారం స్వగ్రామంలో జరగనున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పలు

ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత చెందారు. ఆటో అదుపుతప్పి నందిపేట మండలంలో ఓ వృద్ధుడు, బైక్‌ అదుపుతప్పి పిట్లం మండలంలో ఓ యువకుడు, డొంకేశ్వర్‌ మండలంలో

ఒకరు చనిపోయారు. వర్ని మండలంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు

మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement