
జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు కలేనా?
జక్రాన్‌పల్లి: జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కలగానే మిగిలిపోయేలా ఉంది. దీనికి కేంద్ర కమిటీ సభ్యు లు ఇచ్చిన నివేదిక బలాన్ని చేకూరుస్తోంది. జక్రాన్‌పల్లి మండలంలోని మనోహరాబాద్, జక్రాన్‌పల్లి, కొలిప్యాక్, తొర్లికొండ, అర్గుల్ గ్రామాల పరిధిలో సుమారు 1663 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను ప్రభుత్వం ఎయిర్‌పోర్టు స్థాపనం కోసం సిద్ధం చేసింది. జిల్లాకు 2009లో వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎన్ రాజశేఖర్‌రెడ్డి జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి పలు దఫాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సర్వేలు నిర్వహించాయి. ప్రతిపాదిత స్థలాన్ని వి మాశ్రయానికి అనుకూలంగా సిద్ధం చేసి ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఇటీవల పర్యటించిన ఎయిర్‌పోర్టు అథారిటీ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు. ఎయిర్‌పోర్టు స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వంతో పునఃసమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. దానికనుగుణంగా కేంద్ర వైమానిక శాఖ ఎన్ శ్రీనివాసరావు, మల్లికా జయరాజ్, శైలేశ్ దఖానేతో కూడిన బృందాన్ని కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి 25 వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ కమిటీ రిపోర్టు ప్రకారం విమానాశ్రయ స్థలంలో మసీదు, నీటి వనరులు, విద్యుత్ స్తంభాలు, కొన్ని నివాస ప్రాంతాలు, కొండ శిఖర వ్యాసార్థంలో అడ్డంకులు ఉన్నాయని తేల్చింది. ఈ అంశాలను టెక్నో ఎకనామిక్ వయబిలిటీ రిపోర్టులో సైతం ప్రస్తావించామని తెలిపింది. అందు లో పేర్కొన్న విధంగా భారత వైమానిక దళస్థలం, భూసేకరణ, భౌతిక అడ్డంకులకు సంబంధించిన సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయని నివేదిక అందజేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకులు లేని భూమిని ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కమిటీ తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం పంపాల్సిన రిపోర్టులను పంపకుండా, అనువైవ భూములను ఎంపిక చేసి ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు.

జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు కలేనా?