
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
నిజామాబాద్‌అర్బన్: ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రణాళికను రూపొందించి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి ఒడ్డెన్న అన్నారు. ఇంటర్ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఒడ్డెన్నను జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఒడ్డెన్న మాట్లాడుతూ.. ఇంటర్ ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి పాస్ కావడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని బోధించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రత్యక్ష లేదా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణపై సమీక్ష నిర్వహించి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు కళాశాలకు హాజరై ఫెయిల్ అయిన విద్యార్థుల జాబితా సేకరించి వారందరూ తరగతులకు హాజరయ్యేలా ప్రిన్సిపాల్‌లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అలాగే పదో తరగతి పాసైన విద్యార్థుల జాబితాను సేకరించి ప్రత్యక్షంగా విద్యార్థులను కలుస్తూ వారిని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించేందుకు ప్రణాళికను రూపొందించాలని అన్నారు. జిల్లా అకడమిక్ సెల్ ఆర్గనైజర్ నరసయ్య, ప్రిన్సిపాల్‌లు తదితరులు పాల్గొన్నారు.