
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ రవికుమార్
డిచ్‌పల్లి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్‌ఎస్‌ఈటీఐ) నూతన డైరెక్టర్‌గా ఎం రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సంస్థ డైరక్టర్‌గా పని చేసిన సుంకం శ్రీనివాస్ ఏప్రిల్ 30న పదవీ విమరణ పొందారు. ఆయన స్థానంలో ఎస్‌బీఐ ఉన్నతాధికారులు రవికుమార్‌ను నియమించారు. బాధ్యతలు స్వీకరించి న అనంతరం రవికుమార్ మాట్లాడుతూ.. ఎలక్ట్రీషియన్(30రోజులు), సీసీటీవీ ఇన్‌స్టాలేషన్(13 రోజులు) ఫొటో అండ్ వీడియోగ్రఫీ (30 రోజులు) కోర్సులలో పురుషులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 3 నుంచి 20వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 40 ఏళ్ల లోపు వయసు కలిగిన యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసువాలని కోరారు. ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, పదో తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు డిచ్‌పల్లిలో ఉన్న ఎస్‌బీఐ శిక్షణ కేంద్రంలో సందర్శించాలని, 08461–295428 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.