
బాకీ డబ్బులు అడిగినందుకే హత్య
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి శివారులో వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ఓ మహిళ హత్య కేసును 48 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకే నిందితుడు ఆమెను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన కవిత(44) బుధవారం సాయంత్రం వ్యవసాయ పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త గంగారెడ్డి, కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకొని కనిపించింది. మృతురాలు ఒంటిపై ఆభరణాలు లేకపోవడంతో దుండగులు ఆమెను హత్య చేసి ఉంటారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్జానం, ఆధారాలతో నిందితుడిని పాత నేరస్తుడు జంగంపల్లి మహేశ్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఏడాది క్రితం నిందితుడు భిక్కనూర్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. ఆ కేసులో జైలులో ఉన్న అతడికి బెయిల్ మంజూరు చేయించడానికి గాను అతడి కుటుంబ సభ్యులు ఈ కేసులో మృతురాలైన చిదుర కవిత వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నారు. మహేశ్ నెల రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చాడు. తన వద్ద తీసుకున్న రూ.లక్ష తిరిగి ఇవ్వాలని కవిత పలుమార్లు మహేశ్‌ను అడగడంతో ఆమెను చంపేస్తే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని భావించిన అతను పథకం ప్రకారం బుధవారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రం దగ్గరకు వస్తే డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి నమ్మించాడు. ఒంటరిగా ఉన్న కవితపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఆపై చీరతో మెడకు ఉరి బిగించి హత్య చేసి మృతురాలి ఒంటిపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లాడని ఎస్పీ వివరించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. 48 గంటల్లోనే కేసును చేధించడంలో విశేషంగా కృషి చేసిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
నర్సన్నపల్లి మహిళ హత్య కేసును
ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర