
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
సుభాష్‌నగర్: రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మికుల కోసం మరిన్ని పథకాలు అమల్జేస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మే డే సందర్భంగా నగరంలోని శ్రద్ధానంద్‌గంజ్‌లోగల మార్కెట్‌కమిటీ మీటింగ్ హాల్‌లో హమాలీ, దడువాయి, చాటా కార్మికులకు చైర్మన్ ముప్ప గంగారెడ్డితో కలిసి ఆయన దుస్తులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ.. మే డే అంటేనే కార్మికులు తమ సమస్యలపై గొంతెత్తే దినమన్నారు. గంజ్‌లో పని చేసే కార్మికులందరికీ లైసెన్సులు, ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు.
ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ ప్రారంభం..
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ మార్కెట్‌యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను చైర్మన్ ముప్ప గంగారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు తక్కువ ధరకు నాణ్యమైన భోజనం, టిఫిన్లు, చాయ్ వంటివి అందించడానికి క్యాంటీన్‌ను ప్రారంభించామన్నారు. ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ తారాచంద్, డీసీసీబీ డైరెక్టర్ గోర్కంటి లింగన్న, మార్కెట్ డైరెక్టర్లు, మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
మే డే సందర్భంగా మార్కెట్ యార్డులో కార్మికులకు దుస్తుల పంపిణీ