
గుర్తు తెలియని మహిళ మృతదేహం గుర్తింపు
మోపాల్: మండలంలోని కాల్‌పోల్, పూర్వ వర్ని మండలంలోని తిమ్మాపూర్ అటవీ శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గురువారం రాత్రి గుర్తించారు. గుర్తు తెలియని మహిళ తునికాకు సేకరణకు వచ్చి దారితప్పిపోయి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల కిందటే మహిళ మృతిచెంది ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కేసు విషయమై మోపాల్ ఎస్సై యాదగిరిని వివరణ కోరగా మహిళ మృతదేహంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని శుక్రవారం ఘటన స్థలాన్ని పరిశీలిస్తామని తెలిపారు. మృతదేహం మోపాల్ శివారు, పాత వర్ని శివారు ప్రాంతమ అనేది తెలియాల్సి ఉంది.
ఇసుక వేలంతో రూ.51వేల ఆదాయం
మోర్తాడ్: భీమ్‌గల్ మండలం బెజ్జోరా వాగు నుంచి ఇసుకను తవ్వి అక్రమంగా నిలువ చేయగా వాటిని ఇటీవల రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గురువారం వాటికి వేలం నిర్వహించగా రూ.51వేల ఆదాయం లభించింది. బెజ్జోరా శివారులోని వాగు నుంచి తరలించి డంప్ చేసిన 25 ట్రాక్టర్ల ఇసుకకు తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్ వేలం నిర్వహించారు. ఏడుగురు వ్యాపారులు వేలంలో పాల్గొనగా బాబాపూర్‌కు చెందిన సమీర్ ఇసుక టెండర్‌ను దక్కించుకున్నాడు.
కేసులో వృద్ధురాలిని విచారించిన జడ్జి
ఖలీల్‌వాడి: అదనపు కట్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని నిజామాబాద్ రెండవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీనివాస్‌రావు గురువారం కోర్టు ఆవరణలో ఉన్న ఆమె వద్దకు వచ్చి విచారించారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌కు చెందిన ఓ మహిళ పలువురిపై వేధింపులు, అదనపు కట్నం పేరిట కోర్టులో కేసు వేశారు. విచారణలో భాగంగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు అనసూయను జడ్జి ఆమె వద్దకు వచ్చి విచ్చారించి వివరాలు తెలుసుకున్నారు.

గుర్తు తెలియని మహిళ మృతదేహం గుర్తింపు