
మహిళా సంఘాలకే స్కూల్ యూనిఫాంల బాధ్యత
మోర్తాడ్(బాల్కొండ): పాఠశాలల పున:ప్రారంభంలోపు సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలను అందించేందుకు అటు విద్యా శాఖ, ఇటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ చర్యలు తీసుకుంటున్నాయి. మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడంతోపాటు విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలను అందించేలా చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లో 2024–25 విద్యా సంవత్సరం ముగిసే నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని 47,016 మంది బాలురు, 54,442 మంది బాలికలకు రెండు జతల యూనిఫాంలను కుట్టించనున్నారు. విద్యాశాఖ ఇప్పటికే క్లాత్‌ను అప్పగించగా, సెర్ప్ ఉద్యోగులు మండలాల వారీగా టైలరింగ్ చేసే తమ సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు. ఒక్కో జత యూనిఫాంను కుట్టేందుకు రూ.75 చొప్పున కూలి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఒక్కో జతకు రూ.50 కూలి చెల్లించగా, కూలి గిట్టుబాటు కావడం లేదని మహిళా సంఘాల సభ్యులు సర్కారుకు విన్నవించారు. దీంతో ప్రభుత్వం స్పందించి రూ.25 చొప్పున కూలిని పెంచింది. గత సంవత్సరమే కూలి పెంచగా ఈ ఏడాది కూడా అంతే మొత్తం కూలి చెల్లించనున్నారు. కాగా, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా కూలి ధర పెంచితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక్కో జతకు రూ.75 చొప్పున కూలి
యూనిఫాం క్లాత్ అప్పగించిన
అధికారులు
జూన్ 1వ తేదీలోపు
కుట్టించాలని నిర్ణయం
సకాలంలో అందిస్తాం..
విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలను అందించేందుకు సలహాలు అందించాం. మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంతో యూనిఫాంలు కుట్టేందుకు ముందుకొచ్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పాఠశాలల పున:ప్రారంభానికి ముందే యూనిఫాంలను అప్పగిస్తాం.
– సాయాగౌడ్, పీడీ, సెర్ప్