
నగదు, ఆభరణాల కోసమే మహిళ హత్య
కామారెడ్డి క్రైం: లింగంపేట మండల కేంద్రంలో ఈనెల 23న వెలుగు చూసిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఒంటరిగా నివసిస్తున్న మహిళ వద్దనున్న నగదు, ఆభరణాల కోసమే నిందితుడు హత్య చేసినుట్లు పోలీసుల విచారణలో తేలింది. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర వివరాలు వెల్లడించారు. లింగంపేటకు చెందిన లక్ష్మి(45) ఒంటరిగా ఉంటూ స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె భర్త ప్రభాకర్ గతంలో అనారోగ్యంతో మృతి చెందగా కుమార్తె శిరీషకు వివాహం జరిగి హైదరాబాద్‌లో ఉంటుంది. ఇటీవల ఆమెకు కన్నాపూర్ గ్రామానికి చెందిన మరో కూలీ గారబోయిన శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. ఈనెల 20న శ్రీకాంత్ ఆమె ఇంటికి వెళ్లగా, ఆమె ఇంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలపై కన్నేశాడు. ఎవరూ లేనిది చూసి చీరతో మెడకు ఉరివేసి హతమార్చాడు. అనంతరం మృతురాలి సెల్‌ఫోన్ తీసుకుని, ఇంటికి ఓ తాళం బిగించి, ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు. ఆమె కుమార్తె ఫోన్ చేయగా లేపకపోవడంతో ఇంటి పక్కింటివారిని సంప్రదించింది. వారు ఇంటికి వెళ్లగా దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని బుధవారం లింగంపేట వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడు గతంలో ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలో కూడా ఇలాంటి హత్యకే పాల్పడ్డాడని, పలుమార్లు జైలుకు సైతం వెళ్లి వచ్చాడని, అతడిపై మొత్తం 9కేసులు ఉన్నాయని ఎస్పీ వివరించారు. కేసు చేధనలో విశేషంగా కృషి చేసిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస రావు, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై వెంకట్ రావు, సిబ్బంది మురళి, జవ్వి నాయక్, శ్రీనివాస్ లను అభినందించారు.
లింగంపేట మర్డర్ కేసును
ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్‌చంద్ర