
భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
జక్రాన్‌పల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారం కానున్నాయని, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ రైతులకు చట్టంలోని అంశాలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి భరోసా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం–2025 తెచ్చిందని తెలిపారు. సివిల్ కోర్టుకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజనల్ అధికారికి, కలెక్టర్‌కు అధికారాలు కల్పించారని అన్నారు. ఇదివరకటి తరహాలోనే రెవెన్యూ కోర్టులను పునరుద్ధరించారని తెలిపారు. భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో భూమికి భూదార్ సంఖ్య కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనివల్ల భూ ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. భూ హక్కుల రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే, భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ ఇన్‌చార్జి ఆర్డీవో స్రవంతి, ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ కిరణ్మయి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ దత్తాద్రి, ఏవో దేవిక, ఆర్‌ఐ ప్రవీణ్ పాల్గొన్నారు.
సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
జక్రాన్‌పల్లిలో రైతులకు
అవగాహన సదస్సు