
వీడీసీలను కట్టడి చేయండి
ఆర్మూర్: గ్రామాల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లను కట్టడి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వీడీసీలకు కుల వృత్తిదారులు వెట్టి చాకిరీ చేసే దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్‌లో మంగళవారం బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో వీడీసీల ఆగడాలను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న అన్ని కులాలపై వీడీసీలు పెత్తనం చెలాయిస్తూ కుల వృత్తులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తాళ్లరాంపూర్‌లో గౌడ కులస్తుల మీదనే కాకుండా జిల్లాలోని నాగంపేట్, మెండోర, పల్లికొండ, చేంగల్ తదితర గ్రామాల్లో యాదవులు, గంగపుత్రులు, రజక, ముదిరాజ్ తదితర కుల వృత్తులపై సైతం వీడీసీల ఆగడాలు కొనసాగుతున్నాయన్నారు. ఆయా కులవృత్తిదారుల నుంచి లక్షల రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారన్నారు. ఇకపై బీసీ కులాల జేఏసీ ఈ ఆగడాలను నియంత్రించడంలో పోరాటం చేస్తుందన్నారు. అనంతరం ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్‌కు గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్, ఆర్మూర్ జేఏసీ అధ్యక్షులు నరసింహ చారి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు బిజ్జు దత్తాద్రి, దేగం యాదగౌడ్, బస్సాపూర్ శంకర్, మహిపాల్ యాదవ్, బీఎస్‌ఎన్‌ఎల్ రాజన్న, రాజమల్లు యాదవ్, స్వామి యాదవ్, భుమన్న యాదవ్, గూపన్ పల్లి శంకర్, బట్టు నరేందర్, లక్ష్మి నర్సయ్య, రవినాథ్, పల్లికొండ నర్సయ్య, వేల్పూర్ శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్, రామగౌడ్, గంగాధర్, చందు, గంగాధర్, నర్సింగ్, రమేష్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఆర్మూర్‌లో బీసీ కులాల
జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ

వీడీసీలను కట్టడి చేయండి