
నిజామాబాద్‌నాగారం: గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికై న ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలను సేకరించి బుధవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల ఆస్తులు, కేసులు, విద్యార్హతలు ప్రకటించారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించిన ప్రకారం జిల్లాలో అత్యధికంగా ఆస్తి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి ఉంది.
ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 109.97కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలిపారు. బీఏ చదువును మధ్యలోనే నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఇక మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆస్తి గత ఐదేళ్లలో 238 శాతం పెరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 34.76 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. 2018లో రూ. 10.27 కోట్లుగా చూపించారు. బీఈ చదివినట్లు.. తనపై ఒక్క కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్‌రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తన అఫిడవిట్‌లో రూ. 59.94కోట్లు ఆస్తి ఉన్నట్లు తెలిపారు. ఎంఎస్ ఆర్థో చదివానని.. తనపై రెండు కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి తనకు రూ. 18.5 కోట్ల ఆస్తి ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ఏడో తరగతి చదివినట్లు.. ఆయనపై ఒక కేసులు ఉన్నట్లు తెలిపారు. నిజామాబాద్‌అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా తన అఫిడవిట్‌లో రూ. 27.25కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. బీకాం వరకు అభ్యసించినట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలో..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాకు సంబంధించి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆస్తి 2018 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రూ. 4.94 కోట్లు కాగా.. 2023 కు వచ్చేసరికి పది శాతం తగ్గింది. తాజా ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తుల విలువను రూ. 4.40 కోట్లుగా చూపించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కావడం గమనార్హం. ఆయనపై ఒక్క కేసూ లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది.
► జిల్లాలో అత్యధిక ఆస్తులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే.మదన్‌మోహన్‌రావుకు ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఐ అయిన మదన్‌మోహన్‌రావు ఎంఎస్ చదివి, పలు దేశాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీలను స్థాపించారు. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తి విలువను రూ.72.65 కోట్లుగా చూపించారు. ఆయనపై రెండు కేసులున్నాయి.
► కామారెడ్డిలో అటు కేసీఆర్‌ను, ఇటు రేవంత్‌రెడ్డిని ఓడించి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన జెయింట్ కిల్లర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డికి రూ.49.71 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయనపై పదకొండు కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో చూపించారు. ఇంటర్ వరకు చదువుకున్నారు.
► ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన జుక్కల్‌లో విజయం సాధించిన తోట లక్ష్మీకాంతారావు ఆస్తుల విలువ రూ. 8.11 కోట్లు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయనపై రెండు కేసులున్నాయి.