TS Nijamabad Assembly Constituency: వరుసగా మూడోసారి బిగాల గణేశ్‌గుప్తా.. బహిరంగ సభలో కేటీఆర్‌ పిలుపు..
Sakshi News home page

గణేశ్‌గుప్తాకే కేటీఆర్‌ జై... ఆకుల లలిత ఆశలు ఆవిరి

Aug 12 2023 1:22 AM | Updated on Aug 12 2023 3:59 PM

- - Sakshi

మున్నూరు కాపు కోటాలో నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్టు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఆకుల లలితకు తాజా పరిణామాలతో ఆశలు ఆవిరి అయినట్లు తెలుస్తోంది.

నిజామాబాద్‌: శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యే టిక్కెట్ల విషయంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూనే ప్రత్యర్థి పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరు వస్తారనే విషయమై లెక్కలు వేసుకుంటున్నారు. ప్రత్యర్థి ఏ పార్టీ నుంచి ఎవరు ఉంటే ఏవిధంగా ముందుకెళ్లాలనే విషయమై నాయకులు తగిన విధంగా వ్యూహాలు రచించుకుంటున్నారు.

ప్రతి పార్టీ నుంచి టిక్కెట్ల ఆశావహులు తమ టిక్కెట్టు ప్రయత్నాలతో పాటు ప్రత్యర్థి పార్టీల నుంచి టిక్కెట్ల కేటాయింపు విషయమై మరింతగా దృష్టి పెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో సిట్టింగులను కొందరిని మారుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నిజామాబాద్‌ జిల్లాలో ఇద్దరు ముగ్గురు సిట్టింగు ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది.

కాగా నిజామాబాద్‌ అర్బన్‌ బీఆర్‌ఎస్‌ టిక్కెట్టు విషయమై కేటీఆర్‌ తాజా పర్యటన సందర్భంగా ఒక క్లారిటీ వచ్చినట్లేనని వివిధ వర్గాలు భావిస్తున్నాయి. నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ ప్రారంభోత్సవానికి నగరానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి బిగాల గణేశ్‌గుప్తాను గెలిపించాలని కేటీఆర్‌ బహిరంగ సభలోనే పిలుపునిచ్చారు.

ఏకంగా 55 వేల ఆధిక్యతతో గెలిపించాలని ప్రకటించడంతో ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. కేటీఆర్‌ ప్రకటనతో మళ్లీ గణేశ్‌గుప్తాకే టిక్కెట్‌ ఖాయమని తేల్చినట్‌లైందని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో నగరం అభివృద్ధిలో ముందుకు వెళుతోందని, త్వరలో నగరంలో ప్రతి డివిజన్‌కు రూ.1 కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

అభివృద్ధికి కేరాఫ్‌ ఇందూరు అని కేటీఆర్‌ చెప్పడంతో అర్బన్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌లో జోష్‌ నెలకొంది. ఇదిలా ఉండగా ఇటీవల నిజామాబాద్‌లో విలేకరులతో చిట్‌చాట్‌ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సైతం గణేశ్‌గుప్తా గురించి ప్రస్తావిస్తూ ఆణిముత్యం అనడం గమనార్హం. దీంతో గణేశ్‌గుప్తాకు బేఫికర్‌ అనే చర్చ నడుస్తోంది.

ఆకుల లలిత ఆశలు ఆవిరి
మున్నూరు కాపు కోటాలో నిజామాబాద్‌ అర్బన్‌ టిక్కెట్టు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఆకుల లలితకు తాజా పరిణామాలతో ఆశలు ఆవిరి అయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినా కేసీఆర్‌ ఇవ్వలేదు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వడంతో దాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కువగా నగరంలో పర్యటిస్తూ వచ్చారు. అదేవిధంగా మున్నూరు కాపు సంఘాలతో వరుస భేటీలు చేస్తూ వచ్చారు. అర్బన్‌ టిక్కెట్టు వస్తుందని ప్రచారం సైతం చేసుకున్నారు. ఈ క్రమంలో గణేశ్‌గుప్తాకే కేటీఆర్‌ జై కొట్టడంతో లలిత ఆశలు ఆవిరైనట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement