చేపల వేటకు వెళ్లి మృత్యువాత

పయ్యావుల స్వామి(ఫైల్‌) 
 - Sakshi

మాచారెడ్డి: చేపల వేటకు వెళ్లి ఫిట్స్‌ రావడంతో నీట మునిగి ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం మండలంలోని ఎల్లంపేటలో చోటు చేసుకుంది. మాచారెడ్డి ఎస్సై సంతోష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లపు మల్లయ్య(30) గ్రామ శివారులోని మైసమ్మ చెరువుకు మరో వ్యక్తితో కలిసి చేపల వేటకు వెళ్లాడు. చెరువులోకి దిగగానే మల్లయ్యకు ఫిట్స్‌ వచ్చి నీట మునిగాడు. మరో వ్యక్తి కాపాడే యత్నం చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

కరెంట్‌ షాక్‌తో ఒకరి మృతి

గాంధారి(ఎల్లారెడ్డి): విద్యుత్‌ షాక్‌తో మండల కేంద్రానికి చెందిన పయ్యావుల స్వామి(44) గురువారం మృతి చెందినట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు. మరో రైతుకు చెందిన వ్యవసాయ బోరు మోటారు చెడిపోవడంతో మరమ్మతు చేయించి గురువారం ఉదయం చుట్టుపక్కల రైతులు కలిసి మోటారును దించారు. అనంతరం మోటారును స్టార్ట్‌ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు స్వామి విద్యుత్తు షాక్‌కు గురై కింద పడిపోయాడు. తోటి రైతులు వెంటనే మండల కేంద్రానికి తరలించి ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోమ్‌లో చేర్పించారు. పరిశీలించిన వైద్యుడు కామారెడ్డికి తరలించాలని సూచించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతుడి కుమారుడు సతీష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

అనుమానాస్పదంగా మహిళ..

ఖలీల్‌వాడి: ఇందల్వాయి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ వద్ద గల ఎల్‌ సీ గేటు వద్ద గుర్తు తెలియని మహిళ అనుమానాస్పదంగా మృతి చెందినట్లు రైల్వే ఎస్సై ప్రణయ్‌ గురువారం తెలిపారు. ఆమెకు 40 ఏళ్లు ఉంటాయని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలి వివరాలు తెలిస్తే రైల్వే పోలీసులను ఆశ్రయించాలన్నారు.

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top