సాగుకు చమురు లేదు | - | Sakshi
Sakshi News home page

సాగుకు చమురు లేదు

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

ఇంధనం కొరతతో నిలిచిపోయిన ట్రాక్టర్లు, హార్వెస్టర్లు డీజిల్‌ కోసం మహారాష్ట్ర బాటపట్టిన రైతులు భూముల సిద్ధం ఆలస్యమైతే ఖరీఫ్‌పై ప్రభావం

భైంసా: ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తోంది. మరో ఐదు రోజుల్లో రోహిణి కార్తె మొదలవుతుంది. మరోవైపు ఈనెలాఖరుకు రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తరుణంలో రైతులు సాగుకు సమాయత్తం అవుతున్నారు. దుక్కులు సిద్ధం చేసుంటున్నారు. రోహిణి కార్తెలో విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో చమురు(డీజిల్‌) కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే మూడు రోజుల క్రితం కేంద్రం పెట్రో ధరలు రూ.3 పెంచింది. తాజాగా మరో రూపాయి పెంచింది. అయినా జిల్లాలో వాహనాలకు డీజిల్‌ దొరకడం లేదు. ఇప్పటికే అకాల వర్షాలు, పంట కొనుగోలు సమస్యలు, కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఇప్పుడు డీజిల్‌ కోసం పెట్రోల్‌ బంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వర్షాకాలం ప్రారంభానికి ముందు భూములను దున్ని సిద్ధం చేసుకోవాల్సిన సమయంలో డీజిల్‌ లేక ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నిలిచిపోవడం రైతులను కలవరపెడుతోంది.

చివరి దశకు పంట కోతలు

జిల్లాలో వరి కోతలు చివరి దశకు చేరుకున్నాయి. మరోవైపు మొక్కజొన్న పంట నూర్పిడి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హార్వెస్టర్లు, ట్రాక్టర్ల వినియోగం భారీగా ఉండటంతో డీజిల్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే భైంసా డివిజన్‌ పరిధిలోని అనేక పెట్రోల్‌ బంకుల్లో వారం రోజులుగా డీజిల్‌ కొరత కనిపిస్తోంది. కొన్నిచోట్ల పూర్తిగా డీజిల్‌ లేకపోవడంతో రైతులు గంటల తరబడి వేచి చూసినా నిరాశతో వెనుదిరుగుతున్నారు. డీజిల్‌ లేక పంట నూర్పిడి పనులు నిలిచిపోతున్నాయి. ఇప్పటికే కోసిన వరి, మొక్కజొన్న పంట పొలాల్లోనే ఉండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితుల్లో పంట తడిస్తే తీవ్ర నష్టం తప్పదని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఖరీఫ్‌ సాగు కోసం భూములను దున్నే పనులు కూడా ఆలస్యమవుతున్నాయి.

పెరుగుతున్న ఖర్చులు

ఇప్పటికే పెట్టుబడులు పెరిగి రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు భారం అవుతుండగా ఇప్పుడు డీజిల్‌ కొర త మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా భూములు సిద్ధం కాకపోతే ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక దృష్టి పెడితేనే..

వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్రాక్టర్లు, హార్వెస్టర్లకు ప్రత్యేకంగా డీజిల్‌ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ సీజన్‌ సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు, ఆయిల్‌ కంపెనీలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే డీజిల్‌ కొరత జిల్లాలో వ్యవసాయ కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది.

మహారాష్ట్ర బాట..

స్థానికంగా డీజిల్‌ దొరకక కొంతమంది రైతులు పక్కనే ఉన్న మహారాష్ట్ర రాష్ట్రలోని భోకర్‌, ధర్మాబాద్‌ ప్రాంతాలకు వెళ్లి డీజిల్‌ తెచ్చుకుంటున్నారు. ఇందుకోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ట్రాక్టర్లతో దూర ప్రయాణాలు చేయడం వల్ల సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయని పేర్కొంటున్నారు. కొందరు రైతులు రాత్రి వేళలల్లోనే మహారాష్ట్ర బంకులకు వెళ్లి డీజిల్‌ తీసుకొస్తున్నారు.

20 రోజుల్లో వర్షాకాలం

ఇంకా 20 రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. రైతులు భూములను సిద్ధం చేసే పనులు ప్రారంభించారు. అయితే డీజిల్‌ కొరత ఈ పనులకు కూడా ఆటంకం కలిగిస్తోంది. జిల్లాలో ఎక్కువ మంది రైతులు ట్రాక్టర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. సాధారణంగా వ్యవసాయ భూముల్లో ఉన్న ట్రాక్టర్లు, హార్వెస్టర్ల కోసం రైతులు డబ్బాలు తీసుకెళ్లి పెట్రోల్‌ బంకుల నుంచి డీజిల్‌ తెచ్చుకునేవారు. అయితే తాజాగా వాహనాలను నేరుగా బంకులకు తీసుకురావాలని సూచించడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. పొలాల్లో ఉన్న ట్రాక్టర్లను దూరంలోని బంకుల వరకు తీసుకెళ్లడం సాధ్యం కాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement