భైంసాటౌన్:భైంసాలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఎట్టకేలకు మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. గత నెలలో మొదటి సమావేశంలో గందరగోళం నడుమ ఇద్దరు సభ్యుల ఎన్నిక జరిగింది. ఇందులో మైనారిటీ మహిళా విభాగంలో ఒకరి ఎన్నికను ధృవీకరిస్తూ అధికారులు సర్టిఫికెట్ అందించారు. అయితే, మైనార్టీ కోటాలో మరో సభ్యుడి ఎన్నిక కూడా ధృవీకరించాలని ప్రతిపక్ష ఎంఐఎం డిమాండ్ చేసింది. ఈ విషయమై కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. మరోవైపు మొదటి సమావేశంలో ఎన్నికను బహిష్కరించిన పాలకపక్ష సభ్యులు ఈనెల 12న మరోమారు ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఎన్నిక వాయిదా వేస్తూ కమిషనర్ ఒకరోజు రాత్రి ఫోన్ సందేశ రూపంలో చెప్పడంతో, దీన్ని నిరసిస్తూ పాలకవర్గ సభ్యులు మున్సిపల్ కార్యాలయం వద్ద మూడు రోజులపాటు ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే చొరవతో ఆందోళన విరమించిన పాలకపక్ష సభ్యులు ఈ నెల 19న ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల ఎన్నికకు మంగళవారం సమావేశం నిర్వహించారు. పాలకపక్ష సభ్యులు 13, ఎక్స్ అఫీషియో ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిపి 14 మంది సభ్యులకు మెజారిటీ చేరింది. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. కోఆప్షన్ సభ్యులుగా ముజీబ్ అహ్మద్(మైనారిటీ), అల్లకొండ కవిత(జనరల్ మహిళ), తోట లింగురాం (జనరల్ పురుషులు) ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు సభ్యుల ఎన్నిక కోర్టు తీర్పు నిబంధనలకు లోబడి ఉంటుందని సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లింగయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


