జన్నారం: తాత అంత్యక్రియలకు వెళ్తూ గుండెపోటుకు గురై మనుమడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం జన్నారం మండలంలోని పొనకల్ గాంధీనగర్‌కు చెందిన సంకపాగ దేవన్న (35) గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్లలో వరుసకు తాత అయిన చిన్నరాజన్న అంత్యక్రియలకు బస్సులో బయలుదేరాడు. కడెం మండలం ఉడుంపూర్ సమీపంలోకి వెళ్లే సరికి చాతిలో నొప్పి రావడంతో జన్నారం ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుని సూచన మేరకు కరీంనగర్ తరలిస్తుండగా మృతి చెందాడు.
పానీపూరి బండి వద్ద గొడవలో ఒకరిపై దాడి
భైంసాటౌన్: పానీపూరి బండి వద్ద జరిగిన స్వల్ప తగాదా ఒకరిపై దాడికి దారితీసిన ఘటన పట్టణంలోని మున్సిపల్ చౌక్ వద్ద గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దెగ్లూర్‌కు చెందిన రాహుల్ భైంసాలో కొద్దిరోజులుగా పానిపూరి బండి నిర్వహిస్తున్నాడు. ఓవైసీనగర్‌కు చెందిన షేక్ మస్తాన్ గురువారం బండి వద్దకు వచ్చి పానీపూరి అడిగితే నిర్వాహకుడు లేదని బదులిచ్చాడు. అయినా వినకుండా దుర్భాషలాడడంతో ఆగ్రహించిన రాహుల్ రాడ్‌తో మస్తాన్‌ను గాయపర్చాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయికుమార్ తెలిపారు.
విద్వేషాలు వ్యాప్తి చేస్తే చర్యలు
చిన్నపాటి గొడవలు, తగాదాలతో జరిగే ఘటనలకు విద్వేషాలు రెచ్చగొట్టేలా పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఘనంగా ఈఎంటీ దినోత్సవం
నిర్మల్‌ఖిల్లా: జిల్లాకేంద్రంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(ఈఎంటీ) దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. 108 అంబులెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో కేక్ కట్‌చేశారు. ఈఎంటీలు, పైలట్లు పాల్గొని అత్యవసర వైద్య సేవల ప్రాముఖ్యతను వివరించారు. నిర్మల్ జిల్లా మేనేజర్ లింగాచారి మాట్లాడుతూ, జిల్లాలో 108 సేవలు ప్రజలకు అత్యవసర సమయంలో ప్రాణాధారంగా నిలుస్తున్నాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. 108 ఉచితంగా 24 గంటలు అందుబాటులో ఉండే ఈ సేవలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సమానంగా ప్రజలకు చేరువవుతున్నాయని తెలిపారు. జిల్లాలో గతేడాది 30,128 అత్యవసర కేసులకు 108 సేవలు అందించడంతో ప్రజల విశ్వాసం మరింత పెరిగిందన్నారు. గోల్డెన్ అవర్‌లో ఇచ్చే చికిత్సతో అనేక ప్రాణాలను కాపాడగలుగుతున్నామని వెల్లడించారు.


