ఆధ్యాత్మిక కారిడార్‌కు అడుగులు | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక కారిడార్‌కు అడుగులు

Apr 3 2026 7:38 AM | Updated on Apr 3 2026 7:38 AM

● బాసర–భైంసా రహదారి విస్తరణకు డిమాండ్‌ ● కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ముధోల్‌ ఎమ్మెల్యే వినతి

భైంసా: బాసర–భైంసా ప్రధాన రహదారిని ఫోర్‌లేన్‌గా విస్తరించాలనే డిమాండ్‌ మళ్లీ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌, ఎంపీ నగేష్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ కలిసి ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. గతేడాది కేంద్ర మంత్రి సిర్పూర్‌ – కాగజ్‌నగర్‌ పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ ముధోల్‌ ఎమ్మెల్యే కలిసి ఈ ఆధ్యాత్మిక రహదారి నిర్మించాలని విన్నవించారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసిన ఎమ్మెల్యే ఆధ్యాత్మిక మార్గం నిర్మించి తీరుతామని చెబుతున్నారు.

ఆధ్యాత్మిక కారిడార్‌కు అడుగు...

చదువుల తల్లి సరస్వతీదేవి కొలువుదీరిన శక్తి పీఠం బాసర. రేణుక ఎల్లమ్మ కొలువుదీరిన మరో శక్తిపీఠం మహారాష్ట్రలో మహోర్‌. ఈ క్షేత్రంలో దత్తాత్రేయ మందిరం కూడా ఉంది. బాసర నుంచి మహోర్‌ వరకు 164 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు క్షేత్రాల మధ్య మహారాష్ట్రలో సాసర్‌కుండ్‌ జలపాతం ఉంది. ఇటువైపు బాసర వచ్చే భక్తులు అటు వైపు మహోర్‌ వెళ్లే భక్తులు రెండు క్షేత్రాలను దర్శిస్తూ మధ్యలో జలపాతాన్ని సందర్శించేలా ఈ మార్గం పూర్తి చేయాలని ఎన్నో రోజులుగా ఇక్కడి యాత్రికులు కోరుతున్నారు.

అటువైపు పూర్తయ్యింది....

కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో అకోట్‌–బీదర్‌ 161 హైవేను నిర్మించింది. ఈ రోడ్డు మహారాష్ట్రలోని మహోర్‌ నుంచి కిన్వట్‌ మీదుగా వెళ్తుంది. అక్కడి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో కుభీర్‌ ఉంది. ఈ 26 కిలోమీటర్ల రోడ్డు విస్తరిస్తే ఇబ్బంది ఉండదు. భైంసా నుంచి కుభీర్‌ వరకు ఆరేళ్ల క్రితమే డబుల్‌ రోడ్డు నిర్మించారు. మహారాష్ట్ర నుంచి కుభీర్‌ వరకు ఉన్న 26 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేస్తే రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి.

తరచూ ప్రమాదాలు..

బాసర–భైంసా రహదారి రెండేళ్లుగా నిర్మాణంలో ఉంది. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. అయినా ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 30 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రహదారి ప్రస్తుతం రెండు లైన్లకే పరిమితం కావడంతో వాహన రాకపోకలు ఇరుకుగా మారాయి. రోజూ వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీస్తోంది. బాసర, అడెల్లి వంటి ప్రముఖ క్షేత్రాలకు వెళ్లే యాత్రికులు, జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రజలు ఈ రహదారిపైనే ఆధారపడుతున్నారు. ఫోర్‌ లైన్‌గా విస్తరిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని స్థానికులు అంటున్నారు. భైంసా మండలం దేగాం – బిద్రెల్లి టోల్‌ప్లాజాతోపాటు పలు చోట్ల ఇప్పటికీ అసంపూర్తి నిర్మాణాలే ఉన్నాయి.

సరిహద్దు రహదారుల సమస్య

బాసర–భైంసా మార్గం మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉండడంతో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయి. లారీలు, ట్రక్కులు, ఆటోలు నిరంతరం ప్రయాణిస్తుండటంతో రహదారి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఇప్పటికే రెండు జాతీయ రహదారులు ఉన్నప్పటికీ అవి విస్తరించకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. బాసర నుంచి మహోర్‌ వరకు ఫోర్‌లేన్‌ జాతీయ రహదారి నిర్మాణం చేసి, గోదావరి వంతెన వద్ద రక్షణ కంచె ఏర్పాటు చేసి, ప్రమాదాలను పూర్తిగా నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

భైంసా – బాసర రోడ్డు

అభివృద్ధికి మార్గం....

రెండు ఆధ్యాత్మిక కేంద్రాల మధ్య రహదారి నిర్మాణం పూర్తయితే అభివృద్ధికి మార్గం వేసినట్లవుతుంది. బాసర నుంచి మహోర్‌ వరకు ఈ రోడ్డు విస్తరిస్తే ముధోల్‌, భైంసా, కుభీర్‌, హిమాయత్‌నగర్‌, కిన్వట్‌, సాసర్‌కుండ్‌, ఇస్లాపూర్‌ మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. యాత్రికులు పెరిగితే ఈ ప్రాంతంలో పర్యటక అభివృద్ధి జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఏటా దత్తాత్రేయస్వామి దర్శనానికి వెళ్తుంటారు. నాందేడ్‌ జిల్లా పరిధిలోని మహోర్‌ క్షేత్రానికి అక్కడి ప్రభుత్వం రోడ్డు నిర్మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement