భైంసా: దేశంలోనే ప్రఖ్యాత ఆలయమైన బాసరకు ఈనెల 6న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం బాసరకు రానున్నారు. హెలీక్యాప్టర్‌లో సాయంత్రం 4 గంటలకు ఆర్జీయూకేటీకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి వెళ్లనున్నారు. బాసర ఆలయంలో జిల్లా అధికారులతోపాటు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్ష జరిపిన ఇన్‌చార్జి మంత్రి నేరుగా బాసరకు రానున్నారు.
జిల్లావాసుల ఎదురుచూపులు...
ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు బాసర అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లా ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు పలువురు మంత్రులను కలిశారు. బాసర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆరు నెలల క్రితమే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. గతంలో బాసర పర్యటనలోనూ దేవాదాయ శాఖ మంత్రి బాసర అభివృద్దికి పూర్తిస్థాయి హామీ ఇచ్చారు.
పునర్నిర్మాణంపై ఆలోచనలు...
బాసర ఆలయ గర్భగుడి పునర్నిర్మాణంపైన దేవాదాయ శాఖతోపాటు జిల్లా అధికారులు దృష్టిసారించారు. గతంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో స్వల్ప మార్పులు తీసుకువస్తున్నారు. బాసర ఆలయ అభివృద్ధికి సుమారు రూ.180 కోట్లకుపైగానే నిధులు అవసరమని అధికారులు చర్చించారు. మొదట గర్భగుడి విస్తరణ, కృష్ణశిలలతో ఆలయ నిర్మాణం, నాలుగు వైపుల గోపురాలు నిర్మించాలని ఆలోచించారు. శృంగేరీ పీఠాధిపతులను కలిశారు. అందరి ఆలోచనలతో మాస్టర్ ప్లాన్ అమలుకు ముందడుగువేస్తున్నారు.
అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన..
ఈనెల 6న సీఎం రేవంత్‌రెడ్డి బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. గర్భగుడి నిర్మాణం, ఇతర నిర్మాణాలు, ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ముధోల్‌లో రూ.200 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేస్తారని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వెల్లడించారు. సీఎం రాకతో బాసర అభివృద్ధి జరుగుతుందన్న ఆశాభావం జిల్లా వాసుల్లో మరింత పెరిగింది.
మాస్టర్‌ప్లాన్‌కు మోక్షం...
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి బాసర ఆలయ అభివృద్దిపై ఇక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం బాసర అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేసి అందులో పూర్తిస్థాయి ఖర్చు చేయలేకపోయింది. రూ.42 కోట్లను వెనక్కి తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాసర అభివృద్ధిపై పలుమార్లు చర్చలు జరిగాయి. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాసర అభివృద్ధి విషయంపై అసెంబ్లీలోనూ చర్చించారు. రాష్ట్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఇక ఈనెల 6న సీఎం రాకతో బాసర అభివృద్ధి ఖాయమన్న మాట వినిపిస్తోంది.


