భైంసాటౌన్: భైంసా మున్సిపల్ బడ్జెట్ సమావేశం, సర్వసభ్య సమావేశం మంగళవారం వాడీవేడిగా జరిగింది. చైర్మన్ తూమోల్ల దత్తాత్రి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముందుగా 20వ వార్డు కౌన్సిలర్ ఎండీ.జాబీర్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కమిషనర్ వై.నవీన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. పట్టణ ప్రగతి కింద రూ.1.50 కోట్లు నిధులు వస్తాయని పేర్కొ నగా పథకం లేకుండా నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రతిపక్ష నేత జాబీర్ అహ్మద్ ప్రశ్నించారు. రాని నిధులను ఎలా ఖర్చు చేస్తారని నిలదీశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ సంతకంతో కూడిన బడ్జెట్ ప్రతి కావాలని డిమాండ్ చేశారు. దీంతో కమిషనర్, అధికారులు నీళ్లు నమిలారు. గందరగోళం నెలకొనడంతో కమిషనర్ సభను కాసేపు వాయిదా వేశారు. కాసేపటి తర్వాత సమావేశం యథావిధిగా కొనసాగించారు.
బడ్జెట్ రూ.21.02 కోట్లు...
ఇదిలా ఉండగా, 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.21.02 కోట్లతో అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో పన్నుల రూపంలో రూ.7.20 కోట్ల ఆదాయం చూపారు. అలాగే, రూ.4.90 కోట్లు పన్నేతర ఆదాయం డిపాజిట్లు, లోన్లు రూ.60 లక్షలు, గ్రాంట్ల రూపంలో రూ.8.3 కోట్ల ఆదాయం, మొత్తంగా రూ.21.02 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. వీటి నుంచి జీతాల చెల్లింపులు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ బిల్లులు, రుణ వాయిదాలు, గ్రీన్ బడ్జెట్ కోసం రూ.7.60 కోట్లు, ఇంజినీరింగ్ విభాగం, సాధారణ పరిపాలన, టౌన్‌ప్లానింగ్ ఖర్చులు రూ.3.53 కోట్లు, ఇతర వ్య యం రూ.9.87 కోట్లు కేటాయించారు. వైస్ చైర్‌పర్సన్ బీబీ కుతిజా సిద్దిఖా, డీఈఈ సంతోష్‌కుమార్, టీపీవో అనురాధ, మేనేజర్ గౌరీశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


