నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

● ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ ● జిల్లాకు 1,34,600 సమాధాన పత్రాలు ● మూడు విడతలుగా నిర్వహణ

లక్ష్మణచాంద/నిర్మల్‌ రూరల్‌: పదో తరగతి వార్షిక పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. అయినా పాఠశాల విద్యాశాఖ ఇప్పటి వరకు పూర్తయిన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించాలని నిర్ణయించింది. బుధవారం నుంచి జిల్లాలో మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. నిర్మల్‌ పట్టణంలోని సెయింట్‌ థామస్‌ హైస్కూల్లో మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మూల్యాంకన ప్రక్రియలో భాగంగా కోడింగ్‌ శనివారం నుంచి కొనసాగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

జిల్లాకు 1,34,600 సమాధాన పత్రాలు...

మూల్యాంకాన కేంద్రానికి ఈసారి 1,34,600 సమాధాన పత్రాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇందులో తెలుగు 12,223, హిందీ 8,076, ఇంగ్లిష్‌ 25,184, గణితం 26,961 సమాధానాల పత్రాలు వచ్చాయి. భౌతిక రసాయన శాస్త్రం 25,917, జీవశాస్త్రం 12,085, సాంఘికశాస్త్రం 24,154 పేపర్లు పరీక్షలు నిర్వహించిన తర్వాత రానున్నాయి.

మూడు ఫేజ్‌లలో...

ఈ సంవత్సరం నుంచి పదో తరగతి మూల్యాంకనం మూడు విడుతలగా జరుగుతుందని అధికారులు తెలిపారు. మొదటి విడత ఏప్రిల్‌ ఒకటి నుంచి ఏప్రిల్‌ 9 వరకు జరుగుతుంది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, గణితం సమాధాన పత్రాలు మూల్యాంకనం చేస్తారు. రెండో విడత ఏప్రిల్‌ 10 నుంచి 17 వరకు భౌతిక, రసాయన శాస్త్రం, జీవశాస్త్ర పేపర్లు మూల్యాంకనం చేస్తారు. మూడో విడత ఏప్రిల్‌ 17 నుంచి ఏప్రిల్‌ 23 వరకు సాంఘికశాస్త్రం పేపర్లు మూల్యాంకనం చేస్తారు.

అధికారుల నియామకం..

ఈ మూల్యాంక కేంద్ర నిర్వహణకు ఒకరు క్యాంప్‌ ఆఫీసర్‌, ఇద్దరు డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లను నియమించారు. ఏడుగురు అదునపు క్యాంప్‌ అధికారులు, 66 మంది చీఫ్‌ ఎగ్జామినర్లు, 374 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు ,138 మంది స్పెషల్‌ అసిస్టెంట్లు, ఇద్దరూ చీఫ్‌ కోడింగ్‌ అధికారులు, ఏడుగురు అసిస్టెంట్‌ కోడింగ్‌ అధికారులు, 40 మంది కోడింగ్‌ హెల్పర్లను నియమించారు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూల్యాంకనం నిర్వహిస్తారు. మూల్యాంకన కేంద్రంలో తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు సౌకర్యాలు ఏర్పాటు చేశామని విద్యా శాఖ అధికారులు తెలిపారు. నిర్ణీత గడువులోగా మూల్యాంకనం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement