నిర్మల్‌టౌన్: సమష్టి కృషితో పోలీస్ అక్క కార్యక్రమానికి జాతీయస్థాయి గుర్తింపు లభించిందని ఎస్పీ జానకీషర్మిల అన్నారు. పోలీస్ అక్క కార్యక్రమానికి జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించడంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళా పోలీస్ సిబ్బంది కృషి, నిబద్ధత వల్లే స్కోచ్ అవార్డు అందుకున్నామని తెలిపారు. ఈ అవార్డు గౌరవంతోపాటు, బాధ్యతను కూడా పెంచిందన్నారు. ఇకపై మరింత మెరుగైన సేవలు అందిస్తూ.. ప్రతీ బాలికకు భద్రత నమ్మకం కల్పించాలని సూచించారు. అనంతరం మహిళా పోలీసులు మాట్లాడుతూ.. విద్యార్థినులను చైతన్యవంతులను చేస్తూ.. వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గంనిర్దేశం చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్‌చేసి మహిళా సిబ్బందికి తినిపించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, సాయికిరణ్, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


