మృత్యువాతలు.. కన్నీటి గాధలు.. | - | Sakshi
Sakshi News home page

మృత్యువాతలు.. కన్నీటి గాధలు..

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

● ఎడారి దేశాల్లో తుదిశ్వాస విడుస్తున్న వలస కార్మికులు ● ఫిబ్రవరి, మార్చిలో పదుల సంఖ్యలో మరణాలు ● మామడ మండలం పరిమండల్‌ గ్రామానికి చెందిన రాజుల పోతన్న(51) సౌదీ అరేబియాలో ఈనెల 14న అనారోగ్యంతో మృతి చెందాడు. చివరి చూపుకోసం భార్య, పిల్లలు ఎదురుచూస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అధికారులు, గల్ఫ్‌ సంఘాల సహాయం కోరుతున్నారు. ● నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్‌కు చెందిన జావిద్‌(43) ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఈ నెల 26న మృతి చెందాడు. కుటుంబాన్ని ఆదుకునే వ్యక్తి కోల్పోవడంతో భార్యా పిల్లలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ● లక్ష్మణచాంద మండలం పారుపల్లి గ్రామానికి చెందిన కందుకూరి రాజేశ్వర్‌(58) కుటుంబ పోషణ కోసం బహ్రెయిన్‌ వెళ్లాడు. ఫిబ్రవరి 26న గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

ముందస్తు శిక్షణ, వైద్య పరీక్షలు..

విదేశాలకు వెళ్లే కార్మికులకు ముందస్తు శిక్షణ, ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి చేయడం.. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం హెల్ప్‌లైన్లు మృతదేహాల సత్వర రవాణాకు ఆర్థిక సహాయం వంటి చర్యలు తీసుకోవాలని గల్ఫ్‌కార్మిక సంఘాలనాయకులు అభిప్రాయపడుతున్నారు. వలస కార్మికుల భద్రత కోసం ప్రభుత్వంతోపాటు రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు, అక్కడి కంపెనీలు, సంస్థలు బాధ్యత వహించాలని కోరుతున్నారు. సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి మరణాలను కొంతవరకు తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఎడారి దేశాల్లో మోగుతున్న ఈ మరణ మృదంగం ఆగాలంటే సమగ్ర చర్యలు తీసుకోవడం అత్యవసరం.

నిర్మల్‌ఖిల్లా: పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్లిన జిల్లా వలస కార్మికుల జీవితం అనిశ్చితితో నిండిపోతోంది. కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపర్చాలని ఎడారి దేశాలకు వెళ్లిన పలువురు కార్మికులు వివిధ కారణాలతో అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పదుల సంఖ్యలో మరణాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎడారి నేలపై మోగుతున్న ఈ ‘‘మరణ మృదంగం’’ వలస కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపుతోంది. తమ కుటుంబ పోషణ కోసం వెళ్లిన వారు తిరిగి శవపేటికల్లో రావడం లేదా అక్కడే అంత్యక్రియలు జరగడం వంటి ఘటనలు బాధిత కుటుంబాలను కుంగదీస్తున్నాయి.

కారణాలు అనేకం...

ఎడారి దేశాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతలు, తగిన విశ్రాంతి లేకపోవడం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. దీనికి తోడు, గుండె సంబంధిత వ్యాధులు, హీట్‌ స్ట్రోక్‌, ప్రమాదాలు, పని ఒత్తిడి, సరైన వైద్య సదుపాయాల లేమి వంటి ఇతరత్రా కారణాలతో వలస కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నా, భయం లేదా ఉద్యోగ భద్రత కోల్పోతామనే ఆందోళనతో వైద్యం తీసుకోకపోవడం కూడా మరణాలకు దారితీస్తోంది.

కుటుంబాల్లో విషాదం..

విదేశాలకు వెళ్లిన కుటుంబ పెద్ద మరణించడంతో ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతున్నాయి. అప్పులు తీసుకుని విదేశాలకు పంపిన కుటుంబాలు ఇప్పుడు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. చిన్నారుల విద్య, కుటుంబ పోషణ వంటి అంశాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ‘‘బంగారు భవిష్యత్తు కోసం వెళ్లిన వారు శవంగా తిరిగి రావడం మా దురదృష్టం’’ అంటూ పలువురు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొందరు మృతదేహం తెప్పించుకోవడానికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వలస కార్మికుల సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

ఇటీవల జరిగిన కొన్ని మరణాలు..

నర్సాపూర్‌(జి) మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మోహన్‌రావు(50) ఖతార్‌ వెళ్లాడు. అప్పుల బాధ, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఫిబ్రవరి 10న అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement