దళితులను వేధించొద్దు
లక్ష్మణచాంద: దళితులను వేధించొద్దని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోన్ మండలం పాక్‌పట్ల గ్రామంలో శనివారం పర్యటించారు. గ్రామంలోని దళితులకు చెందిన భూములను వారి ఇష్టానికి విరుద్ధంగా, బలవంతంగా తీసుకుంటున్నారన్న ఫిర్యాదు మేరకు గ్రామాన్ని సందర్శించారు. భూయజమానులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూయజమానుల సమ్మతి లేకుండా వారి భూములను స్వాధీనం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించే అధికారం ఎవరికీ లేదన్నారు. దళితుల హక్కులకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదన్నారు. దళిత రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూమిని మాత్రమే తీసుకోవాలని సూచించారు. బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో చట్టాన్ని చేతిలోకి తీసుకుని అనధికారికంగా దళితులను వేధించొద్దని సూచించారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీపౌరుడిపై ఉందన్నారు. గ్రామంలో సివిల్ రైట్స్ కార్యక్రమం నిర్వహించి, గ్రామస్తులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఏఎస్పీ సాయికిరణ్, ఆర్డీవో రత్నకళ్యాణి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానంద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, తహసీల్దార్ మల్లేశ్, దళిత సంఘాల నాయకులు ఉన్నారు.


