ఆమెకు ఎస్టీ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు..
కుభీర్: మండలంలోని పల్సి గ్రామానికి చెందిన బీసీ మహిళ అయిన ద్యావరి సత్తెమ్మకు పంచాయతీ ఎన్నికల సమయంలో ఎస్టీ సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో సత్తెమ్మ సర్పంచ్‌గా పోటీచేసి విజయం సాధించారు. అయితే గ్రామానికి చెందిన కొందరు గిరిజనులు సత్తెమ్మకు ఎస్టీ సర్టిఫికెట్ జారీ చేయడంపై తహసీల్దార్ శివరాజ్‌ను నిలదీశారు. గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే ఉందని ఆందోళనకారులు తెలిపారు. సత్తెమ్మ ఎస్టీ కాదని, 2019 ఎన్నికల్లో ఆమె బీసీ రిజర్వుడు వార్డు నుంచి పోటీ చేసి గెలిచారని తెలిపారు. ఎస్‌కేఎస్‌లో కూడా బీసీ అని ఉందని తెలిపారు. సత్తెమ్మ ఎస్టీ సర్టిఫికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆధారాలతో కూడిన ఫిర్యాదును అందజేశారు. తహసీల్దార్ శివరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హడావుడిగా సర్టిఫికెట్లు జారీ చేశామన్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని గ్రామస్తులకు సూచించారు. దీంతో గ్రామస్తులు తాము కలెక్టర్‌తోపాటు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఫిర్యాదు చేసినవారిలో నాయకులు రాజు, పి.రవికుమార్, విలాస్, మాజీ ఎంపీటీసీ తోట రాములు ఉన్నారు.


