‘ప్రజా’ సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.
శాఖలవారీగా ప్రణాళిక..
నూతన సంవత్సరంలో, శాఖలవారీగా ఏడాదిలో చేపట్టబోయే పనులకు సంబంధించి ప్రణాళికలు రూపొందించుకుని, లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయించాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు ఇందుకు చొరవ చూపాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేక అధికారులు నిత్యం తనిఖీ చేయాలని తెలిపారు. పిల్లలకు వసతి గృహాల్లో కల్పిస్తున్న వసతులు, ఇతర వివరాలు ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లలో తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ప్రత్యేక అధికారులు వసతి గృహాలను తనిఖీ చేసినప్పుడు పదోతరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ వారి అనుమానాలు, ఒత్తిడులను దూరం చేయాలన్నారు. జనవరి ఒకటి నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని ఈ నెల 31 తేదీ వరకు విజయవంతంగా కొనసాగించాలన్నారు. పోలీసు, కార్మిక, శిశు సంక్షేమ, తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, బాల కార్మికులను బంధ విముక్తులు చేయాలన్నారు. బాల కార్మికులను గుర్తిస్తే, 1098 బాలల సంరక్షణ హెల్ప్‌లైన్ నంబరుకు సమాచారం ఇచ్చేలా ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించిన పుష్కర ఘాట్ల ఏర్పాట్ల గురించి, తహసీల్దార్లు నిర్దేశించిన ప్రొఫార్మాలో వివరాలు అందించాలన్నారు. అనంతరం ఎస్సీ విద్యార్థులకు అందించే ఉపకారవేతనాలకు సంబంధించి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భూములు కోల్పోయినం.. ఆదుకోండి
మేము మైసంపేట్(ధర్మజీపెట్) వాస్తవ్యులం. మాకు తాత ముత్తాతల నుంచి సంక్రమించిన రెవెన్యూ భూములు ఉన్నాయి. మా గ్రామచ్ని ఖాళీ చేయించడంతో మా పట్టాభుములు సాగుచేసుకోలేకపోతున్నాం. పంట వేస్తే వన్యప్రాణులు హానిచేస్తాయన్న భయం ఉంది. ప్రభుత్వం మైదానప్రాంతంలో భూమి ఇచ్చి ఆదుకోవాలి.
– మైసం పెట్ (ధర్మజీపెట్) గ్రామస్తులు
భీమన్నగుడి ఏర్పాటు చేయాలి..
మాది దిలావర్‌పూర్ మండలం మడేగాం గ్రామం. గతంలో మా ఊరికి భీమన్న దేవుని గుడి మంజూరు అయినట్టు అధికారులు తెలిపారు. కానీ ఇప్పటికీ గుడి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. మా ఊరి భీమన్న గుడి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
– మడేగాం గ్రామస్తుడు
‘ప్రజా’ సమస్యలు పరిష్కరించాలి
‘ప్రజా’ సమస్యలు పరిష్కరించాలి


