పాక్‌పట్ల వీడీసీపై చర్య తీసుకోవాలి
నిర్మల్‌టౌన్: పాక్‌పట్ల వీడీసీ ఆగడాలు అరికట్టి వారిపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్, వీడీసీ బాధితులు కోరారు. నిర్మల్ ప్రెస్ క్లబ్‌లో గ్రామం నుంచి బహిష్కరించిన నాలుగు దళిత కుటుంబాలతో కలిసి మాట్లాడారు. పాక్‌పట్ల గ్రామ శివారులో తమ తాత ముత్తాతల కాలం నుంచి తమ భూమిలో హనుమాన్ మందిరం ఉందన్నారు. అప్పటి వీడీసీ కోరిక మేరకు మందిర నిర్మాణానికి కూడా భూమి ఇచ్చామన్నారు. ఆ మందిరానికి వెళ్లడానికి మూడు ఫీట్ల దారి ఉండగా, 2014లో అప్పటి వీడీసీ సభ్యులు 9 ఫీట్ల దారి కావాలని అడిగారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వీడీసీ సభ్యులు తమ అనుమతి లేకుండా 18 ఫీట్ల దారి తీశారని తెలిపారు. దీనిని అడ్డుకున్నందుకు తమనే దూషించారని, నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా రూ.లక్ష జరిమానా కట్టాలని వేధిస్తున్నారని వివరించారు. గ్రామ బహిష్కరణ చేయడంతో గ్రామంలో ఎవరూ తమతో మాట్లాడడం లేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇందులో బహిష్కరణకు గురైన బొర్ర శ్రీనివాస్, ముత్యం, గంగారం, నడిపి నర్సయ్య పాల్గొన్నారు.


