కడెం ఆయకట్టు సస్యశ్యామలం
కడెం: యాసంగి పంటలకు సకాలంలో సాగునీరు అందించడంతో కడెం ఆయకట్టు సస్యశ్యామలం అవుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు ఆదివారం సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు యాసంగి పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9.46 కోట్లు ఖర్చు చేసిందన్నారు. త్వరలో పూడిక తొలిగింపు పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రోడ్డు మరమత్తులు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం మండల కేంద్రంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ పనులను ప్రారంభించారు. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఏఎంసీ డైరెక్టర్ లక్కవత్తుల నారాయణ సోదరుడు మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భూషణ్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో సునీత, సర్పంచ్ దీకొండ విజయ్, ఉప సర్పంచ్ పిట్టల రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
సీఎం దృష్టికి ‘సదర్మాట్’ సమస్యలు..
ఖానాపూర్: సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులతోపాటు, ఆయకట్టు రైతుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సదర్మాట్ ఆనకట్ట నుంచి యాసంగి పంటల సాగునీరు విడుదల చేశారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. పడిగెల భూషణ్, మాజిద్, సత్యం, గుగ్లావత్ రాజునాయక్, దయానంద్, వెంకట్రాములు, ఆకుల వెంకాగౌడ్, జంగిలి శంకర్ పాల్గొన్నారు.


