నోటుకు.. రాలవు ఓట్లు..!
‘తొలి’పాఠం గుణపాఠమయ్యేనా! గ్రామాల్లో జోరుగా ప్రలోభాలు కొన్నిపల్లెలో పోటాపోటీగా పంపకాలు తొలివిడత ఫలితాల్లో కనిపించని మనీ ప్రభావం
నిర్మల్: ‘అరె ఏమన్నా ఇది.. మనూళ్లె మరీ ఘోరంగ ఉన్నరు. ఓటుకు ఇంతని ఇచ్చినా కూడా ముఖం చూడలేదు. ఒక్కో ఇంటికి పెద్దమొత్తమే ఇచ్చినమే. అయినా ఆ గల్లీకెళ్లే నాలుగు ఓట్లు కూడా పడలేదు. పైసలిస్తే.. గెలుస్తమన్న ఆశతోని పంచినా.. లాభం లేకుండా పోయిందే. ఇటు గెలువకపోతిమి, అటు పైసలూ లాస్ అయితిమి పో..’ తొలివిడతలో ఓడి న ఓ అభ్యర్థి ఆవేదన ఇది. రూ.లక్షలు ఖర్చుచేసినా ఓటమి తప్పకపోవడంతో ఇప్పటికే తొలివిడత గ్రామాల్లోని పరాజితులు లెక్కలేసుకుంటున్నారు.
ఎన్నిచ్చినా..
చాలాగ్రామాల్లో వార్డు సభ్యులుగా గెలవడానికి కూడా పలువురు అభ్యర్థులు తాయిలాలు ఇవ్వడం శోచనీయం. లక్ష్మణచాంద మండలంలోని ఓ గ్రా మంలో సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు రూ.2 వేలపైనే ఇచ్చినట్లు ప్రచారమైంది. ఒకరిని మించి ఒకరు డబ్బులు పంచినట్లు చెబుతున్నారు. మామడ మండలంలోనూ ఓ గ్రామంలో ఇదే తరహాలో పంపకా లు సాగాయి. ఇక డబ్బులతోపాటు చికెన్, కూల్‌డ్రింక్‌లూ పంచారు. ఇంతచేసినా.. ఓటర్లు ఎటువేయాలో అటే వేశారు.
గుణపాఠమయ్యేనా..!
తొలివిడత ఎన్నికల్లో ఓటర్లు నేర్పిన పాఠం మిగితా రెండు విడతల అభ్యర్థులకు గుణపాఠం అవుతుందా..! అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకునోటు అనే విధానాన్ని వీడాలని చాలామంది సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నా.. గ్రామాల్లో మాత్రం పంపకాల ప్రక్రియ ఆగడం లేదు. రెండోవిడతకు సంబంధించిన పంచాయతీల్లోనూ ప్రలోభాల పర్వం జోరుగానే సాగుతోంది. చాలామంది ఓటర్లూ.. ఓటుకు నోటును ఆశిస్తుండటమూ కనిపిస్తోంది. ‘ఓట్లు వేస్తారా.. లేదా.. తెలియదు కానీ.. పైసలైతే పంచాల్సిందేనే..’ అని అభ్యర్థులే చెబుతుండటం గమనార్హం.


