నేడు నవోదయ పరీక్ష
నిర్మల్ రూరల్: జిల్లాలో శనివారం నిర్వహించనున్న నవోదయ ప్రవేశ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. ప్రతీ విద్యార్థి హాల్‌టికెట్, ఆధార్ కార్డు తప్పకుండా తీసుకురావాలని సూచించారు. పరీక్షకు జిల్లాలో మొత్తం 1,552 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. భైంసా ప్రాంత విద్యార్థులకు భైంసా పట్టణంలోని ఆల్‌ఫోర్స్, వేదం, వాసవి పాఠశాలలు పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. నిర్మల్ ప్రాంత విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాల, విజయ హైస్కూల్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖానాపూర్ ప్రాంత విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని దివ్యనగర్‌లోని వాసవి హై స్కూల్ లో ప్రవేశ పరీక్ష జరగనుంది. 24 మంది విద్యార్థులకు ఒక తరగతి గది చొప్పున కేటాయించారు. పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెంట్‌తోపాటు కాగజ్‌నగర్‌లోని నవోదయ విద్యాలయానికి చెందిన లెక్చరర్లు సెంటర్ లేబర్ అబ్జర్వర్లుగా ఉంటారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ పరమేశ్వర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇన్విజిలేటర్లకు సూచనలు చేశారు.


