ధాన్యంలో కోత.. రైతుల ఆందోళన..!
కుంటాల: విక్రయించిన ధాన్యంలో కోత విధించడంపై మండలంలోని సన్నాలు సాగుచేసిన వరి రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. మండలంలోని అందకూర్ గ్రామంలో ఇటీవల పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన పలువురు రైతులు సన్నరకం ధాన్యాన్ని విక్రయించారు. కొనుగోలు కేంద్రం నుంచి ఐదుగురు రైతులకు చెందిన 802 ధాన్యం బస్తాలను ఈనెల 2న ఓ లారీలో లోడ్ చేసి పెద్దపల్లి రైస్‌మిల్‌కు తరలించారు. అక్కడి నిర్వాహకులు 45 బస్తాలు కోత విధించి 757 బస్తాలకు సంబంధించిన ట్రక్‌షీట్ పంపించారు. పీఏసీఎస్ సిబ్బంది సంబంధిత రైతులకు శుక్రవారం డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసేందుకు ఓటీపీలను ఫోన్ చేసి అడిగారు. ఈ సందర్భంగా ధాన్యం కోత విషయం తెలుసుకుని రైతులు ఆందోళన చెందారు. ధాన్యం కోత విధించడంపై కొనుగోలు కేంద్రం వద్ద నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళన చేస్తున్న రైతులు


