పంచాయతీ ఎన్నికల్లో పొరపాట్లు జరగొద్దు
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామపంచాయతీ ఎన్నికలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. నామినేషన్ల అప్పీల్, మూడు దశల్లో కలిపి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైనన్ని బ్యాలెట్ పేపర్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు సమాచారం అందివ్వడంలో తోడ్పాటు అందించాలన్నారు. ఎన్నికల కేంద్రాలకు చేరుకోవడానికి అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే అధికారులు గుర్తింపు కార్డులు జారీ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, జెడ్పీ సీఈవో శంకర్ తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ సిబ్బంది సమర్ధవంతంగా
పనిచేయాలి
మామడ: గ్రామపంచాయితీ ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, డీపీవో శ్రీనివాస్, డీఈవో భోజన్న, తహసీల్దర్ శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి పాల్గొన్నారు.


