పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తి చేసిన నామినేషన్ల ప్రక్రియ, ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు సభ్యుల వివరాలు జిల్లాల వారీగా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక కూడా పారదర్శంగా జరపాలన్నారు. ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ పూర్తి చేయాలని తెలిపారు. వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏ ర్పాట్లు చేసినట్లు తెలిపారు. తొలి విడత ఎన్నికలు జరిగే ఆరు మండలాల పరిధిలో 16 సర్పంచ్ స్థానా లు ఏకగ్రీవం కాగా, 474 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంక్షేమ శాఖకు సంబంధించి, అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, డీపీవో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, డీఈవో భోజన్న, డీఆర్డీవో విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


