ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆర్డీవో కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగేలా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు ఎయిడ్స్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో నిర్ధారణ, కౌన్సెలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులకు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ప్రసూతి మరణాల తగ్గింపులో కిందిస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారులు చేపట్టిన చర్యలు అభినందనీయమన్నారు. ప్రసూతి మరణాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా మరింత పట్టుదలతో పనిచేయాలన్నారు. ర్యాలీ సందర్భంగా కళాజాత బృందాలు డప్పు పాటలతో ప్రజలకు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఎంహెచ్‌వో రాజేందర్, డీఎల్‌ఎస్‌ఏ సెక్రెటరీ రాధిక, డీఈవో భోజన్న, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.


