దొడ్డిదారిన నల్లబంగారం..!
భైంసాటౌన్: జిల్లాలోని పలు ఇటుక బట్టీలకు నల్ల బంగారం(నేల బొగ్గు) అక్రమంగా రవాణా అవుతోంది. ఎలాంటి బిల్లులు లేకుండా మహారాష్ట్రలోని వని, చంద్రపూర్, ఛత్తీస్‌గడ్‌లోని విలాస్‌పూర్ నుంచి లారీల్లో జిల్లాలోని ఇటుకబట్టీలకు తరలుతోంది. దీంతో అటు ప్రభుత్వరంగ సంస్థ అయిన కోలిండియా, ఇటు సింగరేణి పన్ను రూపంలో ఆదాయం నష్టపోతున్నాయి. జిల్లాలోనూ వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండి పడుతోంది. మన రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు ధర ఎక్కువగా ఉండడం, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో బొగ్గు ధర తక్కువగా ఉండడంతోపాటు జీరోలో వస్తుండడంతో జిల్లాలోని కొందరు ఇటుకబట్టీల యజమానులు అక్రమంగా బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు.
50కిపైగా ఇటుక బట్టీలు..
జిల్లాలో దాదాపు 50–60 వరకు ఇటుక బట్టీలు ఉంటాయి. భైంసా డివిజన్‌లోని ముధోల్, తరోడ, పిప్రి, సరస్వతి నగర్, వానల్‌పాడ్, నిర్మల్ డివిజన్‌లోని బీరవెల్లి, సిద్దులకుంట తదితర ప్రాంతాల్లో ఇటుకబట్టీలు ఉన్నాయి. చాలావరకు బట్టీల్లో నేలబొగ్గును వినియోగిస్తుంటారు. ఒక్కో బట్టికి నెలకు 10–20 టన్నుల చొప్పున జిల్లాలో దాదాపు నెలకు వెయ్యి టన్నుల వరకు నేలబొగ్గు వినియోగం ఉంటుంది. మహారాష్ట్రలో టన్నుకు రూ.6,500 వరకు ఉండగా, మన సింగరేణి బొగ్గు రూ.8,500 వరకు ఉంది. దీంతో జిల్లాలోని కొందరు ఇటుక బట్టీల యజమానులు అక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు. అయితే, అక్కడ లారీల్లో నుంచి దొడ్డిదారిలో సేకరించిన నేలబొగ్గును పోగు చేసి కొందరు అక్కడి హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తుంటారని, అలా పోగయిన బొగ్గును ఎలాంటి బిల్లులు లేకుండా జిల్లాకు తరలిస్తున్నట్లు సమాచారం.
తనిఖీలు చేస్తే ప్రయోజనం...
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులను ఎత్తివేసింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా ఉండడం లేదు. జిల్లా మహారాష్ట్రకు సరిహద్దున ఉండడంతో అక్కడి నుంచి నేలబొగ్గు జిల్లాలోకి జీరోలో రవాణా అవుతోంది. 20 టన్నుల బొగ్గు లోడ్‌కు దాదాపు రూ.20–25 వేల వరకు పన్ను రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. అయితే, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తరచూ తనిఖీలు జరిపి, జిల్లాలోకి అక్రమంగా నేలబొగ్గు రవాణాను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.
తనిఖీలు చేపడతాం..
ఎలాంటి వే బిల్లులు లేకుండా వాణిజ్య సరుకులు రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి నేలబొగ్గు అక్రమంగా రవాణా చేస్తే ఫిర్యాదు చేయాలి. తనిఖీలు జరిపి చర్యలు తీసుకుంటాం. – ఈశ్వర్, సీటీవో, నిర్మల్


