పర్యాటకానికీ.. పట్టదా..!
ఎకోటూరిజంపై ప్రభుత్వం దృష్టి జిల్లాలో పుష్కలంగా ప్రకృతి అందాలు కనువిందు చేసే పచ్చని అడవులు ఇప్పటికీ పట్టించుకోని ‘పర్యాటకం’ దృష్టి పెట్టాలంటున్న జిల్లావాసులు
నిర్మల్: ఉత్తరాన ఎత్తయిన సహ్యాద్రి శ్రేణులు, దక్షిణాన ఎగిసిపడే గోదారి అలలు, పచ్చని అడవులు, ఎత్తయిన గుట్టలు, జాలువారే జలపాతాలు, చెంగున ఎగిరే వన్యప్రాణులు.. ఇలా ఎన్నో ప్రకృతి అందాల కలబోత నిర్మల్ జిల్లా. పచ్చదనంతో పాటు ఆధ్యాత్మిక ఆలయాలు, చారిత్రక కట్టడాలు జిల్లా పర్యాటకానికి మరింత శోభనిచ్చేవే. ఎన్ని ఉన్నా.. పాలకుల కన్ను మాత్రం ఇటువైపు పడటం లేదు. ఇక్కడి నుంచి అధికారులు ఎన్ని ప్రతిపాదనలు పంపినా.. అవి బుట్టదాఖలే అవుతున్నాయి. ఏళ్లుగా టూరిజం అభివృద్ధి మాటలకే పరిమితమవుతోంది. తాజాగా ప్రభుత్వం నేచర్ టు అడ్వెంచర్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎకోటూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈక్రమంలో ఇప్పటికై నా జిల్లాలో పర్యాటక అభివృద్ధి చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
పచ్చని అడవి అందాలు...
అడవులు అంటేనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గుర్తొస్తుంది. అలాంటి అడవుల ఖిల్లాకు స్వాగతం పలికినట్లుగా నిర్మల్‌జిల్లా ఉంటుంది. జిల్లా కేంద్రం నుంచి తూర్పుదిశగా వెళ్తుంటే పచ్చని అటవీ అందాలు స్వాగతం పలుకుతాయి. మామడ, ఖానాపూర్, కడెం, పెంబి మండలాల్లో విస్తృతంగా ఉన్నాయి.
గోదావరి అలలు..
ఖానాపూర్ నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్తే గోదావరి నదిపై అడ్డంగా రాళ్లతో నిర్మించిన సదర్‌మాట్ ఆనకట్ట ఉంటుంది. ఎలాంటి యంత్రాలు, గేట్ల సాయం లేకుండా సహజసిద్ధంగా గోదావరి నీటిని కాలువలకు మళ్లించడం ఇక్కడి ప్రత్యేకత. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంలో గోదావరి అందాలను ఆస్వాదించవచ్చు.
దారి పొడవునా..
జిల్లాకేంద్రం నుంచి కడెం వైపు, అలాగే ఆదిలాబాద్‌వైపు సాగే ఎన్‌హెచ్ 44 బైపాస్‌రోడ్డు మొత్తం పచ్చని అడవుల మధ్యలో సాగుతాయి. జిల్లాలో ఎక్కడైనా సరే.. ఎకోటూరిజానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. కానీ.. గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వమూ జిల్లాపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. తాజాగా చేపట్టనున్న ఎకోటూరిజం అభివృద్ధిలోనైనా జిల్లాను భాగస్వామ్యం చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
పర్యాటకానికీ.. పట్టదా..!


