
దేశ అభివృద్ధిలో సైన్స్ పాత్ర కీలకం
నిర్మల్ రూరల్: దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా ఉందని, దేశం వేగంగా అభివృద్ధి చెందడంలో సైన్స్ పాత్ర చాలా కీలకమని డీఈవో భోజన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జేవీఎన్‌ఆర్ ఉన్నత పాఠశాలలో మంగళవా రం నిర్వహించిన ‘సౌత్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్’లో మాట్లాడారు. విద్యార్థులు ఆవిష్కరణ లు చేసే దిశగా చిన్నప్పటినుంచే ప్రయత్నించాలన్నారు. వ్యవసాయ రంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర పెరగడంతో పంటల దిగుబడి పెరుగుతోందన్నారు. ‘మానవ అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ’అనే ప్రధాన అంశంతో నిర్వహించిన ఈ డ్రామా ఫెస్టివల్‌లో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 20 డ్రామాలతో 180 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్మార్ట్ వ్యవసాయం, డిజిటల్ ఇండియా, ఆరోగ్యం– పరిశుభ్రత, గ్రీన్ టెక్నాలజీ అనే అంశాలతో విద్యార్థులు చేసిన డ్రామాలు మెప్పించాయి. జ్యూరీ మెంబర్లుగా సంపత్‌కుమార్, నాగరాజు, రఫీ వ్యవహరించా రు. ఇందులో తెలంగాణ మోడల్ స్కూల్ కుంటాల కు చెందిన కార్తికేయ, దివ్య, నాగజ్యోతి, గనుశ్రీ, స్వప్న, విశాల్ జస్వంత్ విద్యార్థులు విజయం సాధించారు. రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లా సైన్స్ అధికారి వినోద్‌కుమార్, సైన్స్‌టీం సభ్యులు పాల్గొన్నారు.